
అదే రాష్ట్రంలో మరో అమానవీయం
ఒడిశా: అదే రాష్ట్రం.. అదే అమానవీయ ఘటన. గత సంఘటనల అనుభవాలు తెలిసుకొని కూడా మార్పు రాని వైనం.. మానవత్వాన్ని నిద్రలేపని మనుషుల తత్వం. కాలం చేసిన ఓ గిరిజన మహిళ అంత్యక్రియలు నిర్వహించేందుకు తోటి వారు, గ్రామస్తులెవరు ముందుకు రాకపోవడంతో ఈడ్చుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని కలహందీ ప్రాంతంలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
కోక్సారా బ్లాక్లోని మహిమా పంచాయత్లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మంగళవారం రాత్రి చనిపోయింది. ఆమె వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందని ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. సావిత్రిది సవర కులంకాగా.. ఆమె భర్తది గౌడ కులం. వారిద్దరు పెళ్లి చేసుకున్నారని వారిని వెలివేశారు. అయితే, ఆమె భర్త కొన్ని నెలల కిందటే చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం చనిపోయింది. దీంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సహాయం చేయాల్సిందిగా గ్రామస్తులను మృతురాలి కుటుంబీకులు వేడుకున్నారు. కానీ, ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాన్ని మంచంలో వేసి దానికి రెండు వెదురుబొంగులు కట్టి మార్గం వెంట ఈడ్చుకుంటూ వెళ్లి అంత్యక్రియలకు తీసుకెళ్లారు.
ఇది చూసిన కొంతమంది సానుభూతి పరులు జిల్లా కలెక్టర్కు తెలియజేయగా వారికి సహాయంగా కొంతమందిని పంపించడంతోపాటు రూ.2000 మంజూరు చేశారు. అంతకుముందు దనమాజి అనే గిరిజనుడు తన భార్యను భుజాని మోసుకొని వెళ్లిన ఘటన, ఆస్పత్రికి తీసుకెళుతున్న తన భార్య అనూహ్యంగా మృత్యువాత పడటంతో అర్థాంతరంగా బస్సులో నుంచి దింపేసిన ఘటన ఇదే ఒడిశాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.