అమరులైన ‘సియాచిన్’ సైనికులు
* 10 మంది సైనికుల మరణాన్ని
* అధికారికంగా ధృవీకరించిన సైన్యం
* వీరులకు సెల్యూట్.. ఘటన బాధాకరం: ప్రధాని ట్వీట్
జమ్మూ: సియాచిన్‌లో మంచుతుపాను కారణంగా భారీ మంచు దిబ్బల్లో కూరుకుపోయిన 10 మంది సైనికులు అమరులయ్యారని సైన్యం అధికారికంగా ధృవీకరించింది. రెండ్రోజులుగా.. వైమానిక దళం, ఆర్మీ చేపడుతున్న సహాయక కార్యక్రమాల్లో పురోగతి కనిపించకపోవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఐస్ కట్టర్లతో వెతికినా, స్నిఫర్ డాగ్స్‌తో గాలింపు చర్యలు ముమ్మరం చేసినా.. సైనికుల ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సానుకూల అంశం కనిపించలేదు.
దీంతో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో)తోపాటు వివిధ హోదాల్లోని పదిమంది అమరులైనట్లు ఆర్మీ ప్రకటించింది. ‘సియాచిన్‌లో పదిమంది సైనికుల దుర్మరణం బాధాకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కూడా సైనికుల మృతికి సంతాపం తెలిపారు. సరిహద్దు రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన అమరులకు జాతి యావత్తూ సెల్యూట్ చేస్తోందని.. నార్తర్న్ కమాండ్, ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా ఓ ప్రకటనలో తెలిపారు.
లడఖ్ ప్రాంతంలోని ఉత్తరాది సియాచిన్‌కు 19,600 అడుగుల పైభాగాన ఉన్న సైనిక స్థావరంపై మంచు ఆకస్మికంగా పేరుకుపోయింది. సియాచిన్‌లో రాత్రిళ్లు మైనస్ 42 డిగ్రీల సెల్సియస్, పగలు 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కారణంగా గాలింపు చర్యలు ముందుకు సాగటం లేదు.
నో.. థ్యాంక్స్: గాలింపు చర్యలకు సహకరిస్తామంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనను ఇండియన్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్.. లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ సున్నితంగా తిరస్కరించారు. సహాయం చేస్తామన్న పాక్ మిలటరీ మేజర్ జనరల్ అమిర్ రియాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దులో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇరుదేశాల సైనికులు సహకారం అందిస్తామనడం సహజమేనన్నారు.