సరిహద్దులో చైనా ఆట
డొక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణం చేయడానికి చైనా ప్రయత్నించిన నాటి నుంచి భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి రోజుకో కామెంట్‌తో గ్లోబల్ టైమ్స్ పత్రికలో కథనాలు వస్తున్నాయి. తప్పు తమదే అని తెలిసి కూడా సమర్ధించుకునేందుకు గొంతెత్తి అరచే ప్రయత్నం చేస్తోంది అక్కడి మీడియా. అలాంటి కథనాలలో మరో కీలక కథనమే పంచశీల సూత్రాల ఉల్లంఘన. వాస్తవానికి పంచశీల సూత్రాలను ఎన్నడూ ఉల్లంఘించే ప్రయత్నం భారత్ చేయలేదు. చైనానే అరుణాచల్ ప్రదేశ్ భూభాగానికి పేర్లు పెట్టి పంచశీల సూత్రాలకు తూట్లు పొడిచింది.
అలాంటిది ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. భారత్‌కు అంతర్జాతీయ నియమాలను గౌరవించే అలవాటు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు విచిత్రం. అసలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా చైనా నడుచుకుంటే భారత్‌కు నీతులు చెప్పొచ్చు. అంటే ఆయన ఉద్దేశంలో భారత్‌కు మాత్రమే అంతర్జాతీయ నియమాలు వర్తిస్తాయేమో. ఇప్పటివరకూ తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్న చైనాకు మొదటిసారిగా ప్రతిఘటన ఎదురుకావడంతో మింగుడుపడటం లేదు. 1962 యుద్ధం అనంతరం పెద్ద ఎత్తున సరిహద్దులో భారత బలగాలను మొహరించడం ఇదే తొలిసారి.
దీంతో పంచశీల సూత్రాలను అడ్డం పెట్టుకుని భారత్‌పై బురదజల్లే ప్రయత్నాన్ని ప్రారంభించింది చైనా. డొక్లామ్ భారత భూభాగం. అక్కడికి చేరువలో భూటాన్ దేశ సరిహద్దు కూడా ఉంది. ఆ దేశం కూడా చైనా రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకించింది. దీనిపై చైనా అంటున్న మాట భారత్-భూటాన్‌లు చైనాకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాట.
'చైనా అధికార ప్రతినిధి మాట..
పంచశీల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించింది. పొరుగుదేశం సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ భారత్ ప్రవర్తిస్తోంది. ముందుగా సిక్కింలో బలగాలను వెనక్కు పిలవాలి. ఆ తర్వాతే చర్చలకు రావాలి లేదా తీవ్ర పరిణామాలను చూడాల్సివుంటుంది. భారత దళాలు అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించాయి. పంచశీల నియమాలను ఉల్లంఘిస్తూ చైనా సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకంగా భారత్ మారుస్తోంది. భారత్ పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘించింది.' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెన్ షువాంగ్ అన్నారు.