ఆర్మీ క్యాంపులోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారంటే..?
జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్‌లు, కాల్పులతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు.
తొలుత ఆర్మీ యూనిట్ ప్రాంగణంలోకి సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫాంట్ గ్రాస్ ద్వారా ప్రవేశ మార్గం వద్దకు వచ్చారని, అక్కడ ఉన్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారని తెలిపారు. ఆ విషయం ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, అక్కడే ఆయుధగారాలు, ఆర్మీ కుటుంబాలు ఉన్నాయని వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి దిగగా సమర్థంగా తిప్పికొట్టినట్లు చెప్పారు.