పొలాల్లో కూప్పకూలిన విమాన శకలాలు. (ఇన్‌సెట్లో) ప్రయాణికుల మృతదేహాలు
అల్జీర్స్: ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు.
ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు తరలివచ్చాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని అల్జీరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే.
ప్రమాదంపై అల్జీరియా రక్షణ శాఖ ప్రకటన చేస్తూ.. ‘మొత్తం 247 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అహ్మద్ సలాహ్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం దక్షిణ అల్జీరియాలోని బౌఫరిక్ నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
మధ్యలో టిన్‌డౌఫ్‌లో విమానం ఆగాల్సి ఉంది. పశ్చిమ సహారా ప్రాంతం ప్రస్తుతం మొరాకో అధీనంలో ఉండగా.. దాని స్వాతంత్య్ర పోరాటానికి అల్జీరియా మద్దతిస్తోంది. 300 మంది అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విమానమే మంటల్లో కాలిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం రష్యాలో తయారైంది.
గతంలోనూ..
గత ఆరేళ్లలో అల్జీరియాలో అనేక సైనిక, పౌర విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. డిసెంబర్ 2012న రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2014న టమన్‌రస్సెట్ నుంచి కాన్‌స్టాంటిన్‌కు ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న సీ–130 హెర్క్యులస్ ఆర్మీ విమానం కూలడంతో 77 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో రక్షణ శాఖ ప్రకటించింది. జూలై, 2014న బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వెళ్తున్న ఎయిర్ అల్జేరీ విమానం ఉత్తర మాలిలో కూలిపోవడంతో 116 మంది మరణించారు. వీరిలో 54 మంది ఫ్రెంచ్ జాతీయులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment