
సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు
స్విస్ చాలెంజ్ టెండర్ వివాదమే కారణం
సాక్షి, న్యూఢిల్లీ: సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు స్విస్ ఛాలెంజ్ టెండర్ విధానం అత్యంత వివాదాస్పదమైన నేపథ్యంలోనే అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్.. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించాలని సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 3న ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన ఆయన బుధవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నారు.
గురువారం కూడా ఆయన జైపూర్‌లోనే గడపనున్నారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 7న అంటే శుక్రవారం అమరావతికి చేరుకోవాలి. కానీ, ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌తో తనకున్న సత్సంబంధాల వల్ల ఆ దేశ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకొచ్చిందని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతూ వస్తున్నారు. అయితే స్విస్ చాలెంజ్ విధానం అత్యంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అమరావతిలో పర్యటిస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన సింగపూర్ ప్రధాని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. సింగపూర్ ప్రధాని లీసెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంతో సీఎం చంద్రబాబునాయుడు తర్జనభర్జన పడుతున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు టెండర్ విధానంపై హైకోర్టు వ్యాఖ్యలతో ఇప్పటికే ఇరుకున పడిన ప్రభుత్వానికి సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు చేసుకోవడంతో మరింత ఇరకాటంలో పడేసిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.