
సాక్షి, ముంబై : ముంబైలోని ఇనార్బిట్ మాల్‌లో తనను కొట్టిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, ఆయన భార్య ఆండ్రియా తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర కోరారు. రాజేంద్ర తనను ఉద్దేశపూర్వకంగా తాకాడని అందుకే తాను అతడిపై చేయి చేసుకున్నానని ఆండ్రియా చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆండ్రియా తన చేతిలో ఉన్న బ్యాగ్‌తో వృద్ధుడిని కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆ తర్వాత ఆయనను బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర (59)గా గుర్తించారు. ఆదివారం ముంబైలోని ఓ మాల్‌లో తాను అసభ్యకరంగా తాకానంటూ భర్త కాంబ్లీతో కలిసి ఆండ్రియా తనపై దాడిచేశారని ఘటనపై తన కుమారులకు చెప్పానని రాజేంద్ర తెలిపారు. వారు తమకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే కేసును కొనసాగిస్తామని చెప్పారు.
రాజేంద్ర తనను అభ్యంతరకరంగా తాకిన తర్వాతే తాను ప్రతిఘటించానని, తనవైపు దూసుకొచ్చిన రాజేంద్ర అమర్యాదకరంగా వ్యవహరించడంతో పాటు దురుసు వ్యాఖ్యలు చేశాడని ఆండ్రియా తన చర్యను సమర్థించుకున్నారు. ఆయన కుమారులు వచ్చిన తర్వాత వారు తమతో ఘర్షణకు దిగారని, దీనిపై తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు.