కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!
భారత ఆర్మీపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని బీఎస్ఎఫ్ జవాను కుటుంబం ఆరోపించింది. పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని భారత జవాను గుర్నామ్ సింగ్ సోదరి గుర్జీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. కానీ గాయపడ్డ సైనికులను మాత్రం తీసుకెళ్లడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా వీలుకాని పక్షంలో విదేశాల నుంచి మంచి వైద్య బృందాన్ని అయినా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించొచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రస్తుతం తన సోదరుడు గుర్నామ్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియాకు వెల్లడించారు.
జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్నామ్ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతడ్ని విదేశాలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని గుర్జీత్ కౌర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ లోని హిరానగర్ సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు.పాక్ రేంజర్స్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే.