న్యూఢిల్లీ: విధుల్లో వైకల్యం పొందిన, అమరులైన జవాన్ల పిల్లలకు ప్రతినెలా రూ.10,000 చొప్పున అందిస్తున్న విద్యా సాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ శాఖ ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యా సాయం రూ.10 వేలు దాటరాదని గతేడాది జూలై 1న కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ‘జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యాసాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం’ అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. విద్యాసాయంపై కేంద్రం గరిష్ట పరిమితిని విధించడంపై త్రివిధ దళాల్లో పెద్దఎత్తున అప్పట్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఆర్మీ, నేవీ, వాయుసేనకు చెందిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీవోఎస్‌ఈ) ఈ పరిమితిని ఎత్తివేయాలని రక్షణశాఖకు లేఖ రాసింది. 1972లో తీసుకొచ్చిన పథకం కింద ప్రస్తుతం స్కూళ్లు, కళాశాలలు, ఇతర వృత్తివిద్యా సంస్థల్లో చదువుకునే జవాన్ల పిల్లలకు విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment