క్షుద్రవిద్యల నెపంతో ఆరుగురి హత్య
క్షుద్రవిద్యలు, మంత్రాల నెపంతో జరుగుతున్న వరుస హత్యలు ఒడిశాలోని గిరిజన గ్రామాలను వణికిస్తున్నాయి. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలోని ఆరుగురిన్ని కొట్టిచంపిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఒడిశాలోని గిరిజన గ్రామం లాహందాలో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతబడులు, మంత్రాలు వేస్తున్నారనే అపోహతో కుటుంబంపై గ్రామస్తులు దాడిచేశారు. పదునైన ఆయుధాలు, కత్తులతో విరుచుపడ్డారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పిల్లలు కూడా ఉన్నారన్నారు.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసు అధికారి అజయ్ ప్రతాప్ ఎలిపారు. దీంతో డీజీపి సంజీవ్ మారిక్ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలాన్ని సందర్శించింది. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కోసం డీజీపీ ఆదేశించారు. దీంతో గ్రామంలోని పురుషులందరూ పరారీలో ఉన్నారు. కాగా రాయగఢ్ జిల్లాలో ఇలాంటిదే మరో దారుణం జరిగింది. క్షుద్రవిద్యలు, మంత్రాలు తెలుసనే ఆరోపణలతో గ్రామంలోని జగన్బంధు అనే వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.