
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఓటర్ల జాబితాలో ‘ఇతరుల’విభాగంలో చేరిన ట్రాన్స్‌జెండర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం మేరకు.. ఇతరుల విభాగంలో ఇప్పటివరకు ఎన్‌రోల్ అయిన ఓటర్లు 38,325 మంది కాగా.. గత ఐదేళ్లలో కొత్తగా చేరిన వారు కేవలం 15,306 మందే. ట్రాన్స్‌జెండర్లు ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు 2012 నుంచి అనుమతించారు. తమ జనాభా కంటే చాలా తక్కువస్థాయిలో ఐదేళ్లలో ఓటరు జాబితాలో చేరారని.. ఇప్పటికీ ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారని ట్రాన్స్‌జెండర్ల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. 2011 గణాంకాల ప్రకారం తమ వర్గానికి చెందిన వారి జనాభా 4.9 లక్షలని.. అయితే ఈ సంఖ్య కంటే ఎక్కువే తమ వారున్నారని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ల కింద నమోదైతే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. ఇతరుల విభాగంలో ఎన్‌రోల్ అయ్యేందుకు అడుగుతున్న ధ్రువపత్రాల కారణాంగా కూడా ఎక్కువ మంది ఓటు నమోదుచేసుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు.
ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విషయమై ఒక్క గుర్తింపు కోసం ఎన్నో ధ్రువపత్రాలు అడుగుతున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ‘ఇది ట్రాన్స్‌జెండర్లకు చాలా కష్టమైన పని. వీరిలో చాలా మందికి అన్నిధ్రువపత్రాలు ఉండవు..’అని ప్రత్యత్ జెండర్స్ ట్రస్ట్‌కు చెందిన అనింధ్య హజ్రా వ్యాఖ్యానించారు. అలాగే పాస్‌పోర్టుల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని.. 2014 నల్సా తీర్పునకు విరుద్ధంగా వైద్య ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని వాపోయారు. ఓటర్ జాబితాలో ఇదివరకు స్త్రీ లేదా పురుషుడుగా నమోదైన వారు ఇతరుల విభాగంలో చేరేందుకు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ‘2014లో ఇచ్చిన కోర్టు తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అన్ని రాష్ట్రాలు ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులివ్వాలని.. వీటి మేరకే ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని చెప్పినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు..’అని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్, తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్ ట్రాన్స్‌జెండర్ సమితికి చెందిన మీరా సంఘమిత్ర వాపోయారు.