నిర్మల్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తుది జాబితాను శుక్రవారం వెల్లడించారు. ఇందులో 10,20,320మంది పురుష ఓటర్లు, 10,43,552మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అలాగే 91మంది ఇతరుల కింద ఓటు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా నిర్మల్‌లో, అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్లు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
నిర్మల్‌లోనే అధికం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,01,106 మంది ఉండగా మహిళలు 1,99,795మంది, పురుషులు 2,01,300, ఇతరులు 11మంది ఉన్నారు.
మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,85,301మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో 2,90,903మంది మహిళలు, 2,94,359మంది పురుషులు, ఇతరులు 39మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిధిలో 4,09,341మంది ఓటర్లు ఉన్నారు. 2,07,703మంది మహిళలు ఉండగా, 2,01,630మంది పురుషులు, ఇతర 8మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,45,151మంది మహిళలు, 3,23,031మంది పురుషులు, 33మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్ల నమోదు కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు.
మహిళలదే పైచేయి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20,63,963మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. జనాభా పరంగా పురుషుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులతో పోల్చితే 23,232మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పురుష ఓటర్లు 3,23,031మంది ఉండగా 3,45,151మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్ల జాబితాలోనూ మహిళల చైతన్యం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91మంది ఇతరుల విభాగంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 39మంది ఇతరుల విభాగంలో ఉన్నారు.
కుమురంభీంలో స్వల్పం..
జిల్లాల వారీగా పోలిస్తే కేవలం రెండు నియోజకవర్గాల పరిధి కలిగిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువ ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ 4,01,106మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాతో పోలిస్తే కాస్త ఎక్కువగా 4,09,341మంది ఓటర్లు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనూ రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇక అత్యధికంగా మూడు నియోజకవర్గాలు ఉన్న నిర్మల్ జిల్లాలో 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ 5,85,301మంది ఓటర్లు నమోదయ్యారు.
నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓటర్లు గల్లంతు కావడంతో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, 2కే రన్, స్పెషల్ డ్రైవ్ వంటివి నిర్వహించారు. దీంతో నిర్మల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంల పరిశీలన పూర్తయింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి నంబర్లను కేటాయించడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment