సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: శాసనసభ సంగ్రామంలో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్లమెంటు ఎన్నికలు సవాల్‌గా మారాయి. పార్లమెంటు ఎన్నికల్లో స్థానిక అంశాలు కాకుండా జాతీయ రాజకీయ పరిణామాలే కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రభ తగ్గిందని, రాహుల్‌గాంధీ పట్ల ప్రజల్లో అనుకూలత పెరుగుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభావం పెద్దగా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు. ఈనెల 20వ తేదీలోగా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను ఏఐసీసీకి పంపించాలని శనివారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో పీసీసీ, సీఎల్‌పీ నేతల సమావేశంలో నిర్ణయించారు.
ఈ మేరకు రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఎన్నికల వేడి షురూ కాబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలోని 8 చోట్ల కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో పోటాపోటీగా ఓట్లు సాధించగా, వాటిలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలు కూడా ఉండడం గమనార్హం. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఈ రెండు లోక్‌సభ స్థానాలు రిజర్వుడు సీట్లే కావడంతో సమీకరణాల కూర్పుపై పార్టీలో భారీగానే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీ టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల రాజకీయ, సామాజిక సమీకరణల మేరకే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు.
ఆదిలాబాద్‌లో ఆదివాసీలకు అవకాశం?
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు ఎస్టీలకు రిజర్వు చేసినవే. వీటిలో ఆసిఫాబాద్ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. బోథ్‌లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, సోయం బాపూరావుకు విజయం దక్కలేదు. ఇక ఖానాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ భారీ తేడాతో ఓడిపోయారు. ఆదివాసీలు స్వయం పాలన ఉద్యమం ఈ లోక్‌సభ పరిధిలోనే మొదలైంది. దీంతో ఆదివాసీలు, లంబాడీలకు మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఆదివాసీ అభ్యర్థికి, లంబాడీలు లంబాడా అభ్యర్థులకే ఓట్లేశారు. ఈ క్రమంలో ఖానాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు లంబాడీలు పోటీలో నిలవడంతో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆదివాసీ అభ్యర్థి అశోక్‌కు ఆ వర్గం ఓటర్లు అండగా నిలిచారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారి ఆదిలాబాద్ నుంచి ఆదివాసీకే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదిలాబాద్‌తోపాటు మహబూబాబాద్ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు కాగా, లంబాడీల జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్‌ను ఆ వర్గానికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ అభ్యర్థిగా బోథ్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన సోయం బాపూరావునే మరోసారి రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఖానాపూర్ నుంచి ఓడిపోయిన రమేశ్ రాథోడ్ సైతం టికెట్టుపై ఆశతో ఉన్నప్పటికీ, టీఆర్‌ఎస్ నుంచి కూడా ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్ పోటీలో ఉండడంతో కాంగ్రెస్ కూడా అదే వర్గీయుడైన సోయంకు అవకాశం ఇస్తుందా? లేక ఓట్లు చీలకుండా లంబాడీ ఓట్ల కోసం రమేశ్ రాథోడ్‌కు చాన్స్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.
పెద్దపల్లి మాలలకేనా?
పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నికైన ఎంపీలలో ఒకరిద్దరు మినహా అందరూ మాల సామాజిక వర్గానికి చెందిన వారే. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇదే వర్గం వారికి టికెట్లు దక్కాయి. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లు ఉండగా, వాటిలో రెండు మాలలకు, ఒకటి మాదిగ వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూలులో ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వారే. వరంగల్ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి మాదిగ వర్గానికి చెందిన వారే పోటీ పడే అవకాశం ఉంది. మిగిలిన పెద్దపల్లి ఎస్సీ స్థానాన్ని మాల వర్గానికి కేటాయిస్తారని గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మాల వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్టు రేసులో ముందు వరుసలో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.
ఆయనతోపాటు గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బోర్లకుంట వెంకటేశ్ నేత కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఒకరు. కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన నేతకాని సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మాల, మాదిగలతోపాటు నేతకాని వర్గానికి కూడా రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని భావిస్తే వెంకటేశ్ నేతకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. ధర్మపురి సీటు నుంచి పోటీ చేసి స్వల్పతేడాతో ఓడిపోయిన వడ్లూరి లక్ష్మణ్ సైతం లోక్‌సభ రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన ఇటీవలే జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అదే నియోజకవర్గానికి చెందిన కాంపెల్లి సత్యనారాయణ కూడా టికెట్టు రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపు అవకాశం ఉన్న వారికే సీటివ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక సైతం ప్రధాన ఆకర్షణగా నిలువనుండడంతో ఇప్పుడున్న ఆశావహులకు మరికొందరు తోడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment