సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలు ప్రయత్నించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కామెంట్ చేయాలనుకోవడం లేదన్న స్మృతి.. ‘ ఇది కేవలం వ్యక్తుల ఇంగిత ఙ్ఞానంపై ఆధారపడి ఉన్న అంశం. రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్‌కిన్లను కనీసం స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా. అలా చేయం కదా. మరి దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకు. ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా.. ప్రతీ ఒక్కరికీ దేవుడిని ప్రార్థించే హక్కు ఉంటుంది.. కానీ హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ‘ఒక మహిళగా నాకు కూడా ఫైర్ టెంపుల్(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించే హక్కు లేదు. ఒకవేళ నా కుమారుడు ప్రార్థించడానికి వెళ్లిన సమయంలో బయటే అతడి కోసం ఎదురుచూస్తా. అలా అని దేవుడంటే నాకు నమ్మకం లేనట్లేనా’ అంటూ స్మృతి ప్రశ్నించారు.
కాగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్‌కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అది నిజమో కాదో తేలక ముందే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మహిళ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ స్మృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment