స్మృతి ఇరానీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. సమాచార ప్రసార (ఐ అండ్ బీ) శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖను అదే శాఖలో సహాయమంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు స్వతంత్ర హోదాతో అప్పగించారు. దాంతో, ఇక ఇరానీ టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా మాత్రమే కొనసాగనున్నారు. స్మృతి ఇరానీని కీలక మంత్రిత్వ శాఖ నుంచి తొలగించడం ఇది రెండోసారి. గతంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నుంచి కూడా ఆమెను తొలగించి, టెక్స్‌టైల్ శాఖను ఇచ్చిన విషయం తెలిసిందే.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైట్లీ కోలుకునేంత వరకూ గోయల్ ఆ పదవిలో కొనసాగుతారు. ఎస్‌ఎస్ అహ్లూవాలియాకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి స్థానంలో ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆల్ఫోన్స్ కన్నథానం ఇకపై పర్యాటక శాఖ సహాయమంత్రిగా మాత్రమే కొనసాగుతారు.
గత సంవత్సరం జూలైలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య నాయుడు సమాచార ప్రసార శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. దాంతో వెంకయ్య నాయుడు స్థానంలో స్మృతి ఇరానీ నియమించారు. కానీ పలు సందర్భాలలో ఇరానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. తాజాగా, నకిలీ వార్తలు రాసే జర్నలిస్ట్‌లపై కేసులు నమోదు చేసి, శిక్షించాలనే నిబంధనలతో ఆమె జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు ప్రధాని మోదీ ఆదేశాలతో ఆ ఉత్తర్వులను ఆమె వెనక్కు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment