చెన్నైవాసులకు అనుకోని అతిథులతో చిక్కులు!
చెన్నై: గత వారం రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై వాసులను కంటి మీద కునుకులేకుండా చేశాయి. గత రెండు రోజులుగా వర్షాలు కొంచెం తగ్గి.. వాతావరణం తేరుకుంటుండటంతో ఇప్పుడిప్పుడు తమిళ తంబీలు కుదుటపడుతున్నారు. ఇలా వర్షాలు తగ్గి.. వీధుల్లో నిండిన వరద నీరు కనుమరుగవుతున్న తరుణంలోనే చెన్నై వాసులకు అనుకోని అతిథులతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. వర్షాలు, వరద కారణంగా బయటకు వచ్చిన విషసర్పాలు, ప్రమాదకరమైన కీటకాలు ఇళ్లలోకి చొరబడి వారిని భయభ్రాంతులను చేస్తున్నాయి.
ముఖ్యంగా దక్షిణ చెన్నైలోని పల్లికరణై, మాదిపక్కం, చిట్లపక్కం, కిల్‌కత్తాలై ప్రాంతాల్లో, ఉత్తర చెన్నైలోని వ్యాసర్పాది, కొలాథూర్‌లలో పాముల బెడద అధికంగా ఉంది. ఇక్కడ నివసిస్తున్న అనేకమంది తమ ఇళ్లలోకి పాములు చొరబడుతుండటంతో బెదిరిపోతున్నారు. దీంతో పాములను పట్టుకోవాల్సిందిగా అటవీశాఖ అధికారులకు రోజూ ఫోన్‌కాల్స్ వెల్లెవెత్తుతున్నాయి. వర్షాలు ప్రారంభమైన నవంబర్ 8 నుంచి ఇలాంటి వస్తూనే ఉన్నాయని, మంగళవారం కూడా ఇప్పటివరకు 15 కాల్స్ వచ్చాయని ఫారెస్ట్ అధికారి ఎస్ డేవిడ్‌రాజు తెలిపారు. గడిచిన పదిరోజుల్లోనే 105కు పైగా పాములను పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేశామని, వర్షపునీరు కారణంగా పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయని ఆయన వివరించారు.