
ఏటీఎంలలో నోట్లకు బదులు జాతీయ గీతం
న్యూఢిల్లీ : దేశంలోని సినిమా థియేటర్లన్నింటిలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ‘జన ఘన మన అధినాయక జయహే’ ఆలాపనను విధిగా వినిపించాలని, ఆ సందర్భంగా థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు గౌరవ సూచకంగా నిలబడడం తప్పనిసరంటూ సుప్రీం కోర్టు బుధవారం ఇచ్చిన ఉత్తర్వులపై సోషల్ మీడియా తనదైన శైలిలో వినూత్నంగా స్పందిస్తోంది. ముఖ్యంగా ట్విట్లర్లో ట్వీట్లు పేలుతున్నాయి.
‘ఏటీఎంలలో క్యాష్ అయిపోగానే జాతీయ గీతాన్ని ప్లే చేయాలి.....వీకో టెర్మరిక్, నహీ కాస్మోటిక్ మన జాతీయ గీతం. అందుకే ప్రతి సినిమాకు ముందు చూపిస్తారు....ప్రతి ఒక్కరు అద్దం ముందు నిలబడి మూడుసార్లు జాతీయ గీతాన్ని ఆలాపించాలి. అలా చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ అద్దంలో ప్రత్యక్షమై మీకో వంద రూపాయల నోటు ఇస్తారు....భవిష్యత్తులో ప్రతి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు ముందు జాతీయ గీతం స్లైడ్‌ను ప్రదర్శించడం తప్పనిసరి చేస్తారేమో!....ఇక వధువు కావలె యాడ్ ఇలా ఉంటుంది: తెల్లగా ఉండే బ్రాహ్మణ యువకుడు ఎంటెక్ చదివాడు. నెలకు ఆరంకెల జీతం. పీవీఆర్‌లో జాతీయ గీతాలాపన వినిపించగానే బుద్ధిగా లేచి నిలబడతాడు....జాతీయ గీతాలాపన సందర్భంగా నేను ఎప్పుడూ నిలబడతాను. ఇక ముందు జాతికి సంబంధించినది ఏదైనా నిలబడతాను, అది నేషనల్ పానోసోనికైనా సరే.....
ఒక్క థియేటర్లలో మాత్రమే ఎందుకు? జాతీయ గీతాన్ని అన్ని చోట్ల, అన్ని లీజర్ సమయాల్లో వినిపించాలి...ప్రతి రెస్టారెంట్లో భోజనానికి ముందు వినిపించాలి....ప్రతి యూట్యూబ్ వీడియోకు ముందు జాతీయ గీతాన్ని వినిపించాలి. అప్పుడు యాడ్స్‌లాగా స్కిప్ చేస్తే పోలీసులు వచ్చి లాప్‌ట్యాబ్, స్మార్ట్‌ఫోన్‌లు తీసుకపోతారు.....ప్రతి పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని ఆశిస్తున్నా....పార్లమెంట్‌లోనే ఐక్యత అవసరం కనుక జాతీయ గీతాన్ని వినిపించడం తప్పనిసరి చేస్తే మంచిది....’ అంటూ ట్వీట్లు వెల్లువెత్తుతుండగా, నరేంద్ర మోదీకి, రవీంద్ర నాథ్ టాగూర్‌కు ఎలాంటి బంధం ఉందంటూ అరవింద్ కేజ్రివాల్ లాంటి వాళ్లు సీరియస్‌గా స్పందించారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఏటీఎంలో ఎప్పుడు క్యాష్ నింపుతున్నారో, అది ఎప్పుడు అయిపోతుందో తెలియక ప్రజలు చస్తున్నారు. క్యాష్ అయిపోగానే జాతీయ గీతాన్ని వినిపిస్తే ఎంచక్కా క్యాష్ లేదని తెలుసుకోవచ్చు. కానీ భక్తిరసం ఎక్కువై క్యాష్ లేకపోయిన ప్రజలు క్యూలో కదలకుండా నిలుచుండిపోతే!...పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో గోల గోల చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను కట్టడి చేయడం కోసం జాతీయ గీతాలాపనను వినిపిస్తే నోరుమూసుకొని నిలబడతారుకదా! కానీ లక్ష్యం నెరవేరాలంటే పదేపదే గీతాలాపనను ఆపకుండా వినిపించాల్సి వస్తుంది కనుక ఎంపీలు ఇక ఎప్పటికీ బయటకు రారేమో! థియేటర్‌లో జాతీయ గీతాలాపనను వినిపిస్తున్నప్పుడు లోపలి నుంచి బయటకు, బయట నుంచి లోపలకు ఎవరూ రాకుండా తలుపులు మూసివేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇక్కడ గమనార్హం.