న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమాల్లో సామాజిక వెబ్‌సైట్ల పాత్ర రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్ర ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం నుంచి భారత్‌లో ఊపందుకున్న ఈ వెబ్‌సైట్ల పాత్ర అప్రతిహతంగా ముందుకెళుతోంది. కేంద్రంలోని యూపీఏ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కిందకు దింపి మోదీ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడంలో, ఢిల్లీ పీఠాన్ని ‘ఆమ్ ఆద్మీ’కి అప్పగించడంలో సామాజిక వెబ్‌సైట్ల పాత్ర అంతా ఇంతా కాదు. కోల్‌కతా నుంచి జోధ్‌పూర్‌కు, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు ఇప్పుడు అండగా నిలుస్తున్నది నిస్సందేహంగా సామాజిక వెబ్‌సైట్లే. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో రాజకీయ పార్టీల్లో విలువలు అణగారిపోతున్న నేపథ్యంలో ప్రజలకు అండగా తాముంటామంటూ ముందుకొస్తున్న ఈ వెబ్‌సైట్ల పాత్ర ప్రశంసనీయం. ఊసుబోని కబుర్లకు, కాలక్షేప కాకమ్మ కథలకు, పార్టీల చిట్‌చాట్‌లకు, ప్రేమ కలాపాలకు, సెల్ఫీలకే తాము పరిమితం కాలేదంటూ నిరూపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమాలను పాలక, ప్రతిపక్షాలే కాకుండా సామాజిక బాధ్యతను భుజానేసుకొని తిరిగే మీడియా కూడా పట్టించుకోకపోతే...వారి ఆందోళనకు లక్షలాది గొంతులను కలిపి విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత కూడా సామాజిక వెబ్‌సైట్లదే...అందుకు కొన్ని ఉదాహరణలు...
జోధ్‌పూర్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన
ఎన్నో సమస్యలున్న జోధపూర్ ఐఐటీ కాలేజీ గురించి రాజకీయ నాయకుల ముందుగానీ, మీడియా ముందుగానీ మాట్లాడకూడదంటూ ‘విద్యార్థుల ప్రవర్తనా నియమావళి’ పేరిట ఐఐటీ డెరైక్టర్ సీవీర్ మూర్తి గత జనవరితో హుకుం జారీ చేశారు. దీనిపై విద్యార్థల ఆందోళను చేస్తున్న ఎవరూ పట్టించుకోలేదు. వారి ఆందోళనకు పెద్దగా ఎవరికి తెలియని ‘కోరా డాట్ కామ్’ అనే బ్లాగ్ పట్టించుకొని ప్రాచుర్యం కల్పించింది. దాంతో నేషనల్ మీడియాలోనూ విద్యార్థుల ఆందోళనకు ఎంతో ప్రచారం లభించింది. రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు మార్చి 29వ తేదీన ఓ ఉత్తుత్తి సమాధి రాయిని ఏర్పాటుచేసి ‘ఉత్తుత్తి నివాళి’ పేరిట నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి నేషనల్ మీడియా కదిలొచ్చి దేశవ్యాప్త ప్రచారాన్ని కల్పించింది.
సెప్ట్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు
అహ్మదాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ’ (సీఈపీటీ) కళాశాలలో సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సామాజిక వెబ్‌సైట్లు ప్రాచుర్యం కల్పించడం వల్ల కళాశాల యాజమాన్యం దిగొచ్చింది.
ఐఐఎంసీ విద్యార్థులకు చేయూత
డిల్లీలోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్’ (ఐఐఎంసీ) కోర్సులను సరిగ్గా నిర్వహించడం లేదని, ఫాకల్టీకి టీచర్లు సరిగ్గా రావడం లేదని విద్యార్థులు సామాజిక వెబసైట్ల ద్వారా ఉద్యమాన్ని నడిపారు. ఈ ఆందోళనలో ఫేస్‌బుక్ వారికి ఎంతో దోహదపడింది. ఇలా ఎన్నో సామాజిక ఉద్యమాలకు సామాజిక వెబ్‌సైట్లు ఊపరిపోస్తున్నాయి. వీటి వల్ల సామాజిక ప్రయోజనాలతోపాటు హానికరమైన పరిణామాలు కూడా ఉన్నాయని సంగతి తెల్సిందే. వాస్తవాలను బేరేజు వేసుకోకుండా, వివేచనతో, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ‘నాగాలాండ్‌లో రేపిస్టు పేరిట ప్రజల చేతుల్లో జరిగిన హత్య’ లాంటి దారుణాలు పునారావృతం అవుతాయి.
-నరేందర్ రెడ్డి
(సాక్షి వెబ్‌సైట్ ప్రత్యేకం)