
బ్లూవేల్ భూతం: బాలుడిని రక్షించిన పోలీసులు
ముంబైః ప్రపంచదేశాలనే గడగడవణికిస్తున్న మృత్యు క్రీడ ‘బ్లూ వేల్’ బారిన పడిన ఓ 14 ఏళ్ల బాలున్ని పోలీసులు రక్షించారు. ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్ గేమ్ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు.
వివరాల్లోకి వెళ్తే షోలాపూర్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుధీర్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. అయితే అయిదారు రోజుల నుంచి సుధీర్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తల్లిదండ్రులు గమనించారు. సెల్ ఫోన్‌లో బిజిగా ఉండడం కూడా గమనించారు. ముఖ్యంగా అస్వస్థతతోపాటు సరిగా నిద్రపోకపోవడం తదితరాలను గమనించి సుధీర్‌కు నిద్రపోయేందుకు రోజు తలకి ఆయుర్వేదం అయిల్‌తో మసాజ్ చేసేవారు. అయితే ఈ బ్లూ గేమ్ బారిన పడ్డాడన్న సంగతి వారికి తెలియలేదు.
చెప్పపెట్టకుండానే బస్సెక్కాడు...
కొన్ని రోజులుగా సరిగా నిద్రపోకుండా ఉన్న సుధీర్ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోవారికి ఎవరికి ఏమి చెప్పకుండానే ఇంట్లోనుంచి బయటపడ్డాడు. క్రికెట్ అకాడమి కోసమని తీసుకున్న రూ. మూడు వేల రూపాయలతోపాటు, సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరాడు. తాను ఇళ్లు వదిలి వెళ్తున్నానని తనను వెదికించేందుకు ప్రయత్నం చేయవద్దని లేదంటే తానేమైన చేసుకుంటానని బెదిరిస్తూ రాసిన లేఖను చూసి ఇంట్లో సు ధీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగారు.
సెల్‌ఫోన్‌తోనే ఆచూకి లభ్యం....!
సుధీర్ ఇళ్లు విడిచి వెళ్లడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సుధీర్ వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి పుణే దిశలో టేంబూర్ణీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. దీన్నిబట్టి పుణే దిశగా సుధీర్ ప్రయాణిస్తున్న భావించిన పోలీసులు బస్సు డిపోతో పాటు అటువైపు బయలుదేరిన బస్సు డ్రైవర్లు కండక్టర్లతో సంప్రదింపులు జరిపి బాలున్ని వివరాలు చెప్పి ఇలాంటి బాలుడు బస్సులో ఉన్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నంచేశారు. ఇంతలో ఓ బస్సులో వీరు చెప్పిన వివరాలనుసారం ఓ బాలుడు ఉన్నట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లో భిగవాన్ బస్సుస్టాండ్‌కు చేరుకోనున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి పోలీసులకు సమచారం అందించారు. అనంతరం ఆ బస్సులోని సుధీర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దర్యాప్తులో ఇదంత బ్లూ బెల్ గేమ్ ఆడడం వల్లే జరిగిందని తెలిసింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఘోరం జరగకముందే పోలీసులు సుధీర్‌ను రక్షించగలిగారు.