శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఓ జవాను అదృశ్యమయ్యారు. టర్టుక్ సెక్టార్‌లోని మంచు కొండలు విరగడంతో అక్కడ గస్తీలో ఉన్న ఆర్మీ పెట్రోల్ పార్టీ జవాను శుక్రవారం ఉదయం గల్లంతయ్యాడు. ఈ ఘటనలో అదృశ్యమైన జవాను కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా మరో సైనికుడు గాయపడినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి ఓ అధికారి సహా పది ది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా మంచు చరియలు విరిగిపడటంతో మరోవైపు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఏటవాలు ప్రాంతాలకు రాకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బందీపూర్, కార్గిల్, గందర్బల్ జిల్లాల్లో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.