
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ
వార్ధా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ భోజనం చేసిన తర్వాత తమ ప్లేట్లను కడిగారు. మహాత్మాగాంధీ 150జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ సేవాగ్రాం ఆశ్రమం (బాపు కుటీర్)లో మంగళవారం పార్టీ వర్కింగ్ కమిటీ శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి రాహుల్, సోనియాతోపాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు హాజరయ్యారు. బాపు కుటీర్ మహాత్మాగాంధీ చివరి రోజులో గడిపిన ఇల్లు. రాహుల్ ఈ ఆశ్రమానికి రావడం ఇది రెండోసారి. సభ అనంతరం కాంగ్రెస్ నేతలు ఇక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ ప్లేట్లను తాము కడిగారు. వారు మాత్రమే కాక, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్లేట్లను కడిగి.. డిగ్నీటీ ఆఫ్ లేబర్‌ను చాటారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రద్ధాంజలి సభలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, మాజీ కేంద్ర మంత్రులు శివ్‌రాజ్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, ఏకే ఆంటోని, హర్యానా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ హుడా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌లు పాల్గొన్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఈ బాపు కుటీర్‌లో సీడబ్ల్యూసీ సమావేశమైంది. 1942 జూలై 14న క్విట్ ఇండియా ఉద్యమంపై ఇక్కడే తీర్మానం చేశారు. ఆ తర్వాత 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ముంబైలో ప్రారంభమైంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగారంటూ... ఇటీవల కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల విమర్శలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా తమ పార్టీ అధ్యక్షుడు, యూపీఐ చైర్‌పర్సనే తమ ప్లేట్లను కడగడం ద్వారా.. ఇదేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment