న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశముంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న రెండు శాఖలు ఖాళీ కానున్నాయి.
ఇప్పటికే రక్షణ శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. రక్షణ శాఖను అరుణ్ జైట్లీ, పర్యావరణ శాఖను మరో మంత్రి హర్షవర్ధన్ అదనంగా నిర్వహిస్తున్నారు. వెంకయ్య రాజీనామాతో పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల బాధ్యతల్ని వేరొకరికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల అనంతరం కేబినెట్‌లో మార్పులు జరగవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.