త్వరలో స్వదేశీ వ్యోమనౌక | Soon the domestic space ship | Sakshi
Sakshi News home page

త్వరలో స్వదేశీ వ్యోమనౌక

Published Mon, May 16 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

త్వరలో స్వదేశీ వ్యోమనౌక

త్వరలో స్వదేశీ వ్యోమనౌక

దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఇస్రో
♦ నెలాఖర్లో శ్రీహరికోట నుంచి ప్రయోగం
♦ తొలిసారిగా పునర్వినియోగ వాహకనౌక(ఆర్‌ఎల్వీ) వినియోగం
♦ విజయం సాధిస్తే.. పదింతల తక్కువ ఖర్చుతో ఇస్రో ప్రయోగాలు
♦ ఆర్‌ఎల్వీకి ‘కలాం యాన్’ అని పేరుపెట్టే అవకాశం
 
 తిరువనంతపురం: ప్రపంచ అంతరిక్ష చరిత్రలో తనదైన ముద్రవేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమనౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఈ నౌక తుదిమెరుగులు పూర్తిచేసుకుని కౌంట్‌డౌన్‌కు సిద్ధమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో ముందున్న దేశాలు చేయలేకపోయిన ‘పునర్వినియోగ’ (రీ యూజబుల్) వాహక నౌకను రూపొందించటం ద్వారా ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించేలా పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అగ్రదేశాలతో పోలిస్తే దాదాపు 10రెట్ల తగ్గింపు ఖర్చుతో భారత్ భవిష్యత్ ప్రయోగాలను నిర్వహించనుంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వర్షాకాలం ప్రారంభానికి ముందే.. శ్రీహరికోట నుంచి రీయూజబుల్ లాంచ్ వెహికల్-టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ (ఆర్‌ఎల్వీ-టీడీ) ప్రయోగం జరగనుంది. ఈ వ్యోమనౌక బరువు మన రోడ్లపై తిరిగే ఎస్‌యూవీ వాహనమంత పరిమాణంలో, అదే బరువుతో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ఈ షటిల్ తిరిగి శ్రీహరికోటకు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రన్‌వేపైకి సురక్షితంగా చేరుకుంటుందని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ కె. శివన్ వెల్లడించారు. ఇస్రో చేస్తున్న ఈ ప్రయత్నం.. అగ్రరాజ్యాలకు దీటుగా ఎదిగే క్రమంలో వేస్తున్న చిరు అడుగులని ఆయన అన్నారు. భారత భూభాగంపై ఎక్కడా ఐదుకిలోమీటర్లకు మించి రన్‌వే లేకపోవటం వల్లే సముద్రంపై దింపేందుకు వర్చువల్ రన్‌వేను సిద్ధం చేశామన్నారు.
 
 నిఘా క్షిపణి పరీక్ష సక్సెస్
 బాలాసోర్: దేశీయంగా అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టార్ క్షిపణిని భారత్ ఆదివారం ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించింది. శత్రుదేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను ఇది నాశనం చేయగలదు. పరిపూర్ణ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను తయారుచేసుకోవాలన్న లక్ష్యంతో భారత్ దీనికి రూపకల్పన చేసింది. క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో నిలిపి ఉంచిన ఒక నౌక నుంచి పృథ్వి క్షిపణిని శత్రు క్షిపణిలా ప్రయోగించారు.

అబ్దుల్ కలాం ద్వీపంలో ఉంచిన  ఇంటర్‌సెప్టార్ క్షిపణి రాడార్ల నుంచి పృథ్వి గురించి సంకేతాలందుకుని, దానిని గాలిలోనే పేల్చివేయడానికి తన మార్గం గుండా వెళ్లింది. 7.5 మీటర్ల పొడవున్న ఈ క్షిపణిలో దిక్సూచి వ్యవస్థ, అత్యాధునిక కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ ఏవియేటర్లు కూడా ఉంటాయి. ఏక దశ ఘన ఇంధనం ఉండే రాకెట్‌తో పనిచేస్తుంది. కాగా, భారత్ ప్రతిపాదించిన ‘సౌత్ ఏషియన్ శాటిలైట్’ ప్రాజెక్టుపై(సార్క్ దేశాలన్నింటికి కలిపి ఒక టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్ ఉపగ్రహం ఉండాలనే ఆలోచన) తమకు ఆసక్తి లేదని అఫ్గానిస్తాన్ పేర్కొంది. తమ అంతరిక్ష అవసరాలకోసం యురోపియన్ కంపెనీ కాంట్రాక్టు ఇచ్చామంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement