అందాన్ని పెంచే గాడిద పాలు | Soops Makes With Donkey Milk Good For Beauty | Sakshi
Sakshi News home page

డాంకీ మిల్క్‌ సోప్‌! 

Published Tue, May 7 2019 8:34 PM | Last Updated on Tue, May 7 2019 8:35 PM

 Soops Makes With Donkey Milk Good For Beauty - Sakshi

అందాన్ని పెంచే  సౌందర్యసాధనాలెన్నో మార్కెట్లో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి సరసన గాడిద పాలు కూడా చేరనున్నాయి. గాడిద పాలేంటీ అనుకుంటున్నారా? సాధారణంగా సబ్బులు, అందాన్ని పెంచే క్రీముల్లో పాలు, పాలమీగడ కలిపితయారు చేస్తారు. అయితే సరికొత్తగా ఆ పాల స్థానంలో గాడిద పాలను ఉపయోగించి సబ్బులు తయారు చేస్తుంది ఓ  సంస్థ. ఈ సబ్బులు చర్మానికి మరింత అందాన్ని తెస్తాయని సంస్థ చెబుతుండడంతో చాలామంది వీటిని కొనుక్కుంటున్నారు. మరి గాడిద పాల సబ్బు వివరాలేంటో తెలుసుకుందాం... 

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్నాడు వేమన. కానీ.. ఇప్పుడు ఆ గాడిద పాలే.. అందాన్ని పెంచనున్నాయి. గాడిద పాలు కూడా ఆవు పాలతో సమానమైన పోషకాలు కలిగి ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. గాడిద పాలల్లో.. యాంటీ ఏజింగ్‌ గుణాలు బోలెడన్ని ఉన్నాయని ఢిల్లీ సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో వెల్లడైంది. అందుకే.. గాడిద పాలతో సబ్బులను తయారుచేసి ఓ స్టార్టప్‌ కంపెనీ అమ్మకాలు కూడా ప్రారంభించింది. 

ఆర్గానికో కంపెనీ... 
 ఢిల్లీలోని ఆర్గానికో అనే కంపెనీ గాడిద పాలతో అందాన్ని పెంచే సబ్బులు తయారుచేస్తూ అమ్మకాలు చేపట్టింది. సబ్బుల అమ్మకం మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మార్కెట్లో మంచి పేరు కూడా సంపాదించింది. గాడిద పాలతో స్నానంచేస్తే.. చర్మం మృదువుగా మారుతుంది. చర్మం కూడా సంరక్షించబడుతుందట. గాడిద పాల వల్ల చర్మానికి అంత త్వరగా కూడా వృద్ధాప్య ఛాయలు రావు. ఎక్కువకాలం చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి నిగనిగలాడుతుంది. గాడిద పాలలో ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు ఇన్ఫెక్షన్‌లను, మొటిమలను తగ్గిస్తాయని ఆర్గానికో కంపెనీ చెబుతోంది.  

లీటరు పాలు రూ.వెయ్యి... 
ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాలతో తయారుచేసిన సబ్బులకు మంచి డిమాండ్‌ ఉంది. సబ్బుతో పాటు.. గాడిద పాలకు కూడా ఉన్నపళంగా డిమాండ్‌ పెరిగింది. అందుకే లీటర్‌ గాడిద పాల ధర రూ.వెయ్యికి పైగా పలుకుతోంది. గాడిద పాలను తాగితే.. ఆస్తమా, ఆర్థరైటీస్, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట.  గాడిద పాలతో చేసిన సబ్బులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండడంతో.. ఈ పాలతో చేసిన ఒక్కో సబ్బు రూ. 500 వరకు పలుకుతుంది. ప్రస్తుతం గాడిద పాలతో తయారైన సబ్బులకు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం.    

పూర్వీకుల నుంచే.. 
గాడిద పాలు తాగితే... ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వీకుల నమ్మకం. ఆస్తమా, జలుబు, దగ్గు తగ్గుతాయని పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. దీనిని నమ్మేవారు ఎక్కువమందే ఉన్నారు. గాడిద పాలు... మనిషి పాలలాగే ఉంటాయని, యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలతో పాటూ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  పూర్వం గ్రామాల్లో చంటి పిల్లలకు తల్లి పాలకు బదులు గాడిద పాలు పట్టేవారు. అంతేగాక ఈజిప్టును పరిపాలించిన అందమైన మహారాణి క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.  

2017 నుంచే... 
ఈ ఏడాది జనవరిలో చండీగడ్‌లో జరిగిన ‘ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గా్గనిక్‌ ఫెస్టివల్‌’లో మొదటిసారిగా గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘ఆర్గా్గనికో’ సంస్థ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ సబ్బులను విక్రయించింది.దీంతో చాలా మంది సందర్శకులు వాటిని కొనేందుకు ఆసక్తిని చూపారు. అయితే ఈ సబ్బు ధర అంత తక్కువేమీ కాదు. 100 గ్రాముల సబ్బును రూ.499లకు విక్రయించారు. ‘ఆర్గా్గనికో’ వ్యవస్థాపకురాలు పూజా కౌల్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 2017 నుంచి ఈ సబ్బులను ఉత్పత్తి చేస్తున్నామన్నారు.  ‘‘గాడిద పాలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని.. పెరిగే వయస్సు, చర్మంపై ముడతలను నియంత్రించే శక్తి దీనికి ఉందన్నారు. గాడిద రోజుకు ఒక లీటరు పాలు మాత్రమే ఇవ్వడం వల్ల లీటరు పాలు ధర రూ.2000 పలుకుతుందని వివరించారు. అందువల్లే సబ్బు ధర ఎక్కువగా ఉందన్నారు. మాకు ఢిల్లీ, జైపూర్‌లలో మాత్రమే ఔట్‌లెట్స్‌ ఉన్నాయని, త్వరలో గాడిద పాల ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్‌ క్రీమ్‌లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement