న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అభినందన్‌ను పాక్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ప్రత్యేక విమానాన్ని అక్కడికి పంపడానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే భారత ప్రభుత్వ ప్రతిపాదనను పాక్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన పాక్ వాఘా సరిహద్దుల్లోనే అతన్ని భారత్‌కు అప్పగించనున్నట్టు తెలిపింది.
అభినందన్‌ను రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దుకు తీసుకురావడం లేక విమానంలో భారత్‌కు తరలించడం అనే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో భారత్ మాత్రం రెండో మార్గానికే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అభినందన్‌ను వాఘా సరిహద్దుల్లో స్వాగతం పలకడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భారత ప్రభుత్వం భావించినట్టుగా సమాచారం. పెద్ద ఎత్తున మీడియా హడావుడి మధ్య అక్కడి నుంచి అభినందన్‌ను తరలించడం కష్టంగా మారుతుందనే అంచనాతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment