
ఢిల్లీలో సదస్సులో మాట్లాడుతున్న జైశంకర్
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్‌టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెరిగిందని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్‌డీఏ ప్రభుత్వానికి మరోసారి అధికారమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రాంతీయ అనుసంధానతకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే, సార్క్‌తో సమస్యలున్నాయి. అదేమిటో మనందరికీ తెలుసు. ఉగ్రవాద అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ అనుసంధానత, వాణిజ్యం వంటి వాటిల్లోనూ ఇబ్బందులున్నాయి. అందుకే ఆర్థిక అభివృద్ధికి, ప్రాంతీయ సమగ్రతకు సార్క్ కంటే బిమ్స్‌టెక్‌నే కీలకంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. డబ్లు్యటీవో ఆశించిన ఫలితాలను ఇవ్వనందునే పలు దేశాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)లను కుదుర్చుకునేందుకు చొరవచూపుతున్నాయని తెలిపారు. బిమ్స్‌టెక్‌లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి.