ఇండోర్: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) హోదాను కాంగ్రెస్‌కు కట్టబెట్టేందుకు నిరాకరించడాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ మరోసారి సమర్థించుకున్నారు. నిబంధనలు, గత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత(ఎల్‌వోపీ) హోదాకు భాష్యం చెప్పాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో.. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడిన స్పీకర్ పైవిధంగా స్పందించారు. ‘‘ప్రస్తుతం లోక్‌సభలో ఏ ఒక్క ప్రతిపక్షం కూడా 55కుపైగా స్థానాలు సాధించలేదు. సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే.. సదరు పార్టీకి మొత్తం లోక్‌సభ స్థానాల్లో కనీసం పది శాతం సీట్లు వచ్చి ఉండాలన్నది నిబంధన. ఇదే నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి మార్పూ జరగలేదు’’ అని ఆమె అన్నారు.