చెన్నై, సాక్షి ప్రతినిధి: దీపావళి పండుగకు ఇంకొక్క రోజే గడువుండగా ప్రధాన నగరాల్లోని బస్టాండ్ల నుంచి సోమవారం బయలుదేరిన బస్సులన్నీ కిటకిటలాడాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ పండుగకు ప్రత్యేకంగా ఈ సారి 9088 బస్సులను సిద్ధం చేసింది. వీటిల్లో టికెట్ల రిజర్వేషన్‌కు 25 ప్రత్యేక బుకింగ్ కేంద్రాలను తెరిచింది. ఒక్క ఆన్‌లైన్ ద్వారానే 2 లక్షల మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. 300 కిలోమీటర్ల దూరాన్ని దాటి ప్రయాణించేవారి కోసం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. 2011లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా గత దీపావళికి రూ.3.98 కోట్ల వసూలు కాగాఈ ఏడాది దీపావళికి (సోమవారం నాటికి) టికెట్ల బుకింగ్ రూపేణా రూ.4.9 కోట్లు వసూలైంది. సోమవారం ఒక్కరోజే 35 వేల మంది అన్‌రిజర్వుడు, ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకున్నవారు 1.5 లక్షల మంది వస్తారని ఆశించిన రవాణాశాఖ సీఎంబీటీ బస్‌స్టేషన్ వద్ద అదనంగా 1400 బస్సులను సిద్ధం చేసింది. ఇవిగాక కోయంబేడు మార్కెట్ వద్ద విశాలమైన ఖాళీ ప్రాంగణాన్ని సిద్దం చేసి మరో వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా ప్రయాణికులు బస్సుల కొరతను ఎదుర్కొంటున్నారు. బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఆమ్నీ దోపిడీ
ప్రభుత్వ బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోవడంతో ఆమ్నీ (ప్రైవేటు) బస్సు యజమానులు ఇదే అదనుగా టికెట్ల దోపిడీ ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఎగ్మూరు, తాంబరం, పెరుంగళత్తూరు, చెంగల్పట్టు, తిరుచ్చిరాపల్లీ, మదురై, సేలం, ఈసీఆర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలకు 13 స్క్వాడ్ బృందాలు ఏర్పాటయ్యూయి. టోల్‌గేట్లు, ప్రధాన కూడళ్ల వద్ద నిఘా వేసిన అధికారులు రేయింబవళ్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న 22 ఆమ్నీ బస్సులను సీజ్ చేశారు. బస్సు యజమానులకు సంజాయిషీ నోటీసులు పంపారు.
అధికచార్జీల వసూలుకు సరైన సంజాయిషీ ఇవ్వని పక్షంలో వారి బస్సుల పర్మిట్లను రద్దుచేస్తామని అధికారులు తెలిపారు. బస్సుస్టేషన్లలో రద్దీని అవకాశంగా తీసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎంబీటీ బస్‌స్టేషన్‌లో 16 సీసీ కెమెరాలు, 32 వాకీ టాకీలతో 28 నిఘా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. రవాణాశాఖా మంత్రి సెంథిల్ బాలాజీ ఆది,సోమవారాల్లో 16 గంటల పాటు స్వయంగా బస్‌స్టేషన్‌లో ఉంటూ పర్యవేక్షించడం విశేషం. బస్సు చార్జీల దోపిడీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంటూ 16 చోట్ల రవాణాశాఖ బ్యానర్లు కట్టింది. టికెట్ల దోపిడీపై 044-24794709, 26744445, 2474900 నంబర్లకు ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.
బస్సులన్నీ ఫుల్
Published Tue, Oct 21 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM
Advertisement
Advertisement