ప్రత్యేక హోదా ఇచ్చేది ఎన్డీసీనే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ స్పష్టత ఇచ్చింది. దేశంలోని ఏదేని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది కేవలం జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ)నే అని తేల్చిచెప్పింది. గతంలోనూ హోదా అంశంపై అదే సంస్థ నిర్ణయంతీసుకునేదని నితి ఆయోగ్ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా కె.శ్రవణ్‌కుమార్ అనే న్యాయవాది అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నీతిఆయోగ్ ఈమేరకు హోదాపై వివరణ ఇచ్చింది.
‘రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ను గతంలో జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ) ఇచ్చింది. అందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. 1) కొండ ప్రాంతం, 2) తక్కువ జన సాంధ్రత లేదా ఎక్కువభాగం గిరిజన జనాభా ఉండడం 3) పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకునే వ్యూహాత్మాక ప్రాంతంలో ఉండడం, 4) ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వెనకబడి ఉండడం, 5) రాష్ట్ర ఆర్థిక స్థితి బాగో లేకపోవడం వంటి నిబంధనలకు లోబడి ఎన్డీసీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చింది. అందువల్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే ఏకైక సంస్థ ఎన్డీసీ..’ అని పేర్కొంది.