'అమ్మ' కోసం మహా మృత్యుంజయ హోమం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆర్.కె.నగర్ లో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెట్రువేల్ నేతృత్వంలో మహా మృత్యుంజయ గణపతి హోమం శుక్రవారం ప్రారంభమైంది. 20 వేల మంది మహిళలు 'అమ్మ' జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు చెన్నై అపోలో ఆస్పత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం రాత్రి చెన్నైకి చేరుకుంది. ఆమెకు చికిత్స అందించేందుకు గతంలో వచ్చిన అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ(ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా(అనస్తీషియన్), నితీష్‌నాయక్(హృద్రోగ నిపుణులు) మరోసారి అపోలో ఆస్పత్రికి వచ్చి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.