MLA vetrivel
-
ఎమ్మెల్యేకు హైకోర్టు చీవాట్లు.. లక్ష ఫైన్
-
ఎమ్మెల్యేకు హైకోర్టు చీవాట్లు.. లక్ష ఫైన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జనరల్ కౌన్సిల్ సమావేశం జరగకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యే పి. వెట్రివేల్ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమను కాకుండా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. సమావేశానికి వెళ్లడం ఇష్టంలేకపోతే ఇంట్లో కూర్చోవాలని చురక అంటించింది. అంతేకాదు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఎమ్మెల్యే వెట్రివేల్‌ను హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని పదవి నుంచి దించేందుకు శశికళ-దినకరన్ వర్గం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరంతా ఈరోజు బెంగళూరు జైలులో ఉన్న శశికళను కలుస్తారని వార్తలు వస్తున్నాయి. -
'అమ్మ' కోసం మహా మృత్యుంజయ హోమం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆర్.కె.నగర్ లో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెట్రువేల్ నేతృత్వంలో మహా మృత్యుంజయ గణపతి హోమం శుక్రవారం ప్రారంభమైంది. 20 వేల మంది మహిళలు 'అమ్మ' జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు చెన్నై అపోలో ఆస్పత్రిలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు లండన్, ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం రాత్రి చెన్నైకి చేరుకుంది. ఆమెకు చికిత్స అందించేందుకు గతంలో వచ్చిన అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఎయిమ్స్ వైద్యులు గిల్‌నానీ(ఊపిరితిత్తుల నిపుణుడు), అంజన్ టిరిక్కా(అనస్తీషియన్), నితీష్‌నాయక్(హృద్రోగ నిపుణులు) మరోసారి అపోలో ఆస్పత్రికి వచ్చి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. -
వాగ్యుద్ధం
సాక్షి ప్రతినిధి, చెన్నై:శ్రీలంక తమిళుల దారుణ హత్యలకు డీఎంకేనే కారణమని ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపణలు, డీఎంకే సభ్యుల నిరసన ధ్వనులతో అసెంబ్లీ అట్టుడికి పోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. శ్రీలంకలో జరిగిన దారుణ మారణకాండ, కుప్పలు కుప్పలుగా తమిళులు ప్రాణాలు కోల్పోవడానికి డీఎంకే కారణం కాదా అని వెట్రివేల్ నిలదీయడంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి పన్నీర్‌సెల్వం జోక్యం చేసుకుని వెట్రివేల్‌కు మాట్లాడే హక్కు ఉంది, ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీంతో వెట్రివేల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ డీఎంకే అధ్యక్షులు కరుణానిధి శ్రీలంక తమిళులకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పపడ్డారని ఆరోపించడంతో విపక్ష నేత స్టాలిన్ అభ్యంతరం పలుకుతూ వెట్రివేల్ ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత విజయ పరంపర ఇలానే కొనసాగుతుందని, ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను అనే నినాదాన్ని అమ్మ నిజం చేశారని వెట్రివేల్ అన్నారు. ఆమెను అధికారం నుంచి దించేందుకు కొందరు చేసిన కుటిల ప్రయత్నాలు ఫలించలేదని డీఎంకేను పరోక్షంగా విమర్శించారు. ముఖ్యమం త్రి అభ్యర్థులు మాయమైపోయారు, నమక్కు నా మే అంటూ ప్రజల్లోకి వె ళ్లిన మరో నేత నాటకాలు ఆడారని స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించడంతో డీఎంకే సభ్యులు లేచి నిలబడి నిరసన తెలిపారు. అంతేగాక వెట్రివేల్ వైపు చేయి ఎత్తి హెచ్చరికలు చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని సభ్యులంతా తనవైపు తిరిగే మాట్లాడాలని కోరారు. శ్రీ లంక తమిళుల అంశాన్ని ఇక వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై మాట్లాడాల్సిందిగా వెట్రివేల్‌ను స్పీకర్ కోరారు. అసెంబ్లీలో అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నారని డీఎంకే సభ్యులను స్పీకర్ మందలించారు. జయలలితను ప్రశంసించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే: మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ముఖ్యమంత్రి జయలలితను ప్రశంసిం చారు. తమిళనాడు రాజకీయాల్లో తొలి సారిగా ఒక మిహ ళా ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారని జయ ను పొగిడారు. ప్రజల ప్రేమా లేక ధన మా అనే పోరాటంలో తాను గెలిచానని డీఎం కే సభ్యుడు ఐ పెరియస్వామి వ్యా ఖ్యానించగా, రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా జయలలితపై చూపిన ప్రేమ వల్లనే అధికారంలోకి వచ్చామని మంత్రి పన్నీర్‌సెల్వం ఆయనకు బదులిచ్చారు. జయను ప్రశంసించిన విజయధరణి మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ముఖ్యమంత్రి జయలలితను ప్రశంసించారు. తమిళనాడు రాజకీయాల్లో తొలిసారిగా ఒక మిహ ళా ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారని జయను పొగిడారు. 500 టాస్మాక్లు మూసివేస్తున్నట్లుగా అధికారంలోకి రాగా నే సీఎం తన తొలి సంతకంతో ఆదేశాలు జారీ చేయగా, ఈ 500 టాస్మాక్లలో తన నియోజకవర్గంలో కూడా ఒకటి ఉందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, చెన్నై: చెన్నై మహానగరంలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా సీఎం జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్, స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామితో పాటుగా 28 మంది పోటీలో నిలబడ్డారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. నియోజకవర్గం పరిధిలో 2,40,543 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిమిత్తం 460 ఈవీఎంలను ఉంచారు. 230 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. 1205 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించారు. బారులు: ఉదయం ఏడు గంటల కల్లా అనేక పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ , ఆయన భార్య లావణ్య, కుమార్తెలు శ్రీదేవి, రమ్య స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో మధుసూదనన్ కుటుంబానికి మాత్రమే ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఉదయం ఎనిమిది గంటలకు సరిగ్గా ఓటింగ్ ఆరంభమైంది. తొలుత వేగం పుంజుకున్న ఓటింగ్ మధ్యాహ్నానికి మందగించింది. మధ్యాహ్నం రెండు గంటలకు 53 శాతం మేరకు ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటల వరకు మరో పది శాతం మేరకు మాత్రమే ఓటింగ్ నమోదైంది. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉన్న కొన్ని పోలింగ్ బూత్‌లలో పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓటర్లను బలవంతంగా తీసుకెళ్లి మరీ ఓట్లు వేయించడం గమనార్హం. తండయార్ పేటలోని ఏఈ ఆలయం వీధిలోని బూత్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు వంద శాతం ఓటింగ్ జరగడం విశేషం. పరిశీలన: ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా ఎన్నికల తీరును కంట్రోల్ రూం నుంచి పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆయన ఆ కంట్రోల్ రూమ్‌కు పరిమితం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని వెల్లడించే పనిలో పడ్డారు. ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకులు ఆయా పోలింగ్ బూత్‌లను సందర్శించి, అక్కడి సరళిని స్వయంగా పరిశీలిస్తూ వచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద స్థానిక పోలీసుల కన్నా, పారా మిలటరీ బలగాలకు అత్యధికంగా ప్రాధాన్యతను ఇచ్చారు. పారా మిలటరీ వర్గాలకు సర్వాధికారాలను ఈసీ అప్పగించడంతో భద్రతా పరంగా కఠినంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలను విజయవంతం చేసినా, ఓటింగ్ శాతం సరాసరిగా తగ్గింది. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గి ఉండడం బట్టి చూస్తే, డీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, ఆ పార్టీ వర్గాలు ఓటింగ్‌కు మొగ్గు చూపక పోవడం కారణంగా చెప్పవచ్చు. సరాసరిగా నియోజకవర్గంలో 74.4 శాతం మేరకు ఓటింగ్ జరిగి ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో కొత్త చాకలి పేట, తిరువొత్తియూరు రోడ్డులోని పోలింగ్ బూత్‌లో ఉదయాన్నే ఈవీఎం మొరాయించింది. తక్షణం దానిని ఎన్నికల అధికారులు మార్చేశారు. దీంతో అర గంట ఆలస్యంగా ఓటింగ్ ఆరంభమైంది. ట్రాఫిక్‌పై దాడికి యత్నం: ఎన్నికలు జరిగే అన్ని బూత్‌లలో స్వతంత్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని చోట్ల అధికారుల తీరును తన కెమెరాలో బంధించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం, ఓటర్లతో మాట్లాడుతున్న వివరాలను తన కెమెరాల్లో బంధిస్తూ ట్రాఫిక్ ముందుకు సాగారు. ఆ దిశగా ఓ కేంద్రం వద్ద అన్నాడీఎంకే వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడాన్ని తన కెమెరాలో బంధించడం వివాదానికి దారి తీసింది. అక్కడి అన్నాడీఎంకే వర్గాలు ఆయనపై దాడికి యత్నించాయి. పోలీసులు మాత్రం చోద్యం చూశారని చెప్పవచ్చు. పారా మిలటరీ జోక్యంతో అక్కడి నుంచి ట్రాఫిక్ రామస్వామి వెళ్లిపోయారు.తన మీద దాడికి దిగడంతో పాటుగా, తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ట్రాఫిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడినట్టేనని, ధన బలం గెలిచినట్టుగా సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ అసహనం వ్యక్తం చేశారు. తండయార్‌పేట పోలింగ్ బూత్‌లో పరిశీలనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగం చేపట్టిన, తీసుకున్న చర్యలను అభినందించారు. అయితే, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని, ధన బలం గెలుస్తున్నదంటూ పరోక్షంగా ఓటర్ల తీరును విమర్శించే యత్నం చేశారు.