ఎమ్మెల్యేకు హైకోర్టు చీవాట్లు.. లక్ష ఫైన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జనరల్ కౌన్సిల్ సమావేశం జరగకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యే పి. వెట్రివేల్ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమను కాకుండా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. సమావేశానికి వెళ్లడం ఇష్టంలేకపోతే ఇంట్లో కూర్చోవాలని చురక అంటించింది. అంతేకాదు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఎమ్మెల్యే వెట్రివేల్‌ను హైకోర్టు ఆదేశించింది.
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని పదవి నుంచి దించేందుకు శశికళ-దినకరన్ వర్గం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరంతా ఈరోజు బెంగళూరు జైలులో ఉన్న శశికళను కలుస్తారని వార్తలు వస్తున్నాయి.