సాక్షి, చెన్నై: చెన్నై మహానగరంలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా సీఎం జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్, స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామితో పాటుగా 28 మంది పోటీలో నిలబడ్డారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. నియోజకవర్గం పరిధిలో 2,40,543 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిమిత్తం 460 ఈవీఎంలను ఉంచారు. 230 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. 1205 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించారు.
బారులు: ఉదయం ఏడు గంటల కల్లా అనేక పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ , ఆయన భార్య లావణ్య, కుమార్తెలు శ్రీదేవి, రమ్య స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో మధుసూదనన్ కుటుంబానికి మాత్రమే ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఉదయం ఎనిమిది గంటలకు సరిగ్గా ఓటింగ్ ఆరంభమైంది. తొలుత వేగం పుంజుకున్న ఓటింగ్ మధ్యాహ్నానికి మందగించింది.
మధ్యాహ్నం రెండు గంటలకు 53 శాతం మేరకు ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటల వరకు మరో పది శాతం మేరకు మాత్రమే ఓటింగ్ నమోదైంది. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉన్న కొన్ని పోలింగ్ బూత్‌లలో పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఓటర్లను బలవంతంగా తీసుకెళ్లి మరీ ఓట్లు వేయించడం గమనార్హం. తండయార్ పేటలోని ఏఈ ఆలయం వీధిలోని బూత్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు వంద శాతం ఓటింగ్ జరగడం విశేషం. పరిశీలన: ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా ఎన్నికల తీరును కంట్రోల్ రూం నుంచి పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆయన ఆ కంట్రోల్ రూమ్‌కు పరిమితం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని వెల్లడించే పనిలో పడ్డారు. ఎన్నికల ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకులు ఆయా పోలింగ్ బూత్‌లను సందర్శించి, అక్కడి సరళిని స్వయంగా పరిశీలిస్తూ వచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద స్థానిక పోలీసుల కన్నా, పారా మిలటరీ బలగాలకు అత్యధికంగా ప్రాధాన్యతను ఇచ్చారు. పారా మిలటరీ వర్గాలకు సర్వాధికారాలను ఈసీ అప్పగించడంతో భద్రతా పరంగా కఠినంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలను విజయవంతం చేసినా, ఓటింగ్ శాతం సరాసరిగా తగ్గింది. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గి ఉండడం బట్టి చూస్తే, డీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడం, ఆ పార్టీ వర్గాలు ఓటింగ్‌కు మొగ్గు చూపక పోవడం కారణంగా చెప్పవచ్చు. సరాసరిగా నియోజకవర్గంలో 74.4 శాతం మేరకు ఓటింగ్ జరిగి ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో కొత్త చాకలి పేట, తిరువొత్తియూరు రోడ్డులోని పోలింగ్ బూత్‌లో ఉదయాన్నే ఈవీఎం మొరాయించింది. తక్షణం దానిని ఎన్నికల అధికారులు మార్చేశారు. దీంతో అర గంట ఆలస్యంగా ఓటింగ్ ఆరంభమైంది.
ట్రాఫిక్‌పై దాడికి యత్నం: ఎన్నికలు జరిగే అన్ని బూత్‌లలో స్వతంత్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని చోట్ల అధికారుల తీరును తన కెమెరాలో బంధించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం, ఓటర్లతో మాట్లాడుతున్న వివరాలను తన కెమెరాల్లో బంధిస్తూ ట్రాఫిక్ ముందుకు సాగారు. ఆ దిశగా ఓ కేంద్రం వద్ద అన్నాడీఎంకే వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడాన్ని తన కెమెరాలో బంధించడం వివాదానికి దారి తీసింది. అక్కడి అన్నాడీఎంకే వర్గాలు ఆయనపై దాడికి యత్నించాయి. పోలీసులు మాత్రం చోద్యం చూశారని చెప్పవచ్చు. పారా మిలటరీ జోక్యంతో అక్కడి నుంచి ట్రాఫిక్ రామస్వామి వెళ్లిపోయారు.తన మీద దాడికి దిగడంతో పాటుగా, తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ట్రాఫిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడినట్టేనని, ధన బలం గెలిచినట్టుగా సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ అసహనం వ్యక్తం చేశారు. తండయార్‌పేట పోలింగ్ బూత్‌లో పరిశీలనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగం చేపట్టిన, తీసుకున్న చర్యలను అభినందించారు. అయితే, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని, ధన బలం గెలుస్తున్నదంటూ పరోక్షంగా ఓటర్ల తీరును విమర్శించే యత్నం చేశారు.
పోలింగ్ ప్రశాంతం
Published Sun, Jun 28 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement