
మారన్ సోదరులకు కోర్టు సమన్లు
న్యూ ఢిల్లీ: మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్లతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి కళానిధిలకు 2జీ కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమన్లు జారీ చేసింది. ఎయిర్సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని జులై 11న న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
వీరితో పాటు ఎస్ఏఎఫ్ఎల్, సన్డైరెక్ట్ సంస్థ లకు సమన్లు జారీ అయ్యాయి. ఈడీ నమోదు చేసిన చార్జ్షీట్ను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ సెల్ షేర్లను మలేసియాకు చెందిన మ్యాక్సిస్ సంస్థకు అమ్మేలా మారన్ సోదరులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది.