సమాజ్‌వాదీ పార్టీలో చీలిక? | Split Samajwadi Party | Sakshi
Sakshi News home page

సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?

Published Mon, Oct 24 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?

సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?

- తండ్రీకొడుకుల మధ్య ముదురుతున్న వివాదం  
- బాబాయ్ శివ్‌పాల్ సహా ముగ్గురు మంత్రులపై అఖిలేశ్ వేటు
- వారంతా అమర్‌సింగ్ వర్గం నేతలే
- ప్రతిగా సీఎంకు మద్దతుగా ఉన్న రాంగోపాల్ బహిష్కరణ
- ఎస్పీలో ముదురుతున్న వివాదం
- ఎఫ్‌డీసీ నుంచి జయప్రదకూ ఉద్వాసన

నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్, సయేదా షాదాబ్ ఫాతిమాలను మంత్రి వర్గం నుంచి అఖిలేష్ తొలగించగా.. సీఎం వర్గానికి చెందిన రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి అధ్యక్షుడు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది.

 లక్నో: నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది. ఆదివారం జరిగిన అనూహ్య పరిణామాల్లో.. అఖిలేశ్, ములాయం తమ వ్యతిరేక వర్గాల్లోని ముఖ్యనేతలపై వేటు వేయటంతో పార్టీ ముక్కలు కాక తప్పదనే సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా బయటపడకున్నా రెండుగా చీలిపోయారు. తండ్రీ కొడుకుల వివాదం మళ్లీ సర్దుకునే పరిస్థితులు  కనిపించకపోవటంతో.. చీలిక అనివార్యమని రాజకీయ నిపుణులంటున్నారు.

 ఏం జరిగింది?
 సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలతో జాతీయాధ్యక్షుడు ములాయం సింగ్ భేటీ ఏర్పాటు చేశారు. భేటీలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం అందింది. ఇంతలోనే ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలేశ్ హడావుడిగా భేటీ అయ్యారు. ఎన్నికలు, నవంబర్ 3 నుంచి జరగనున్న ‘వికాస్ యాత్ర’పై చర్చించిన అఖిలేశ్.. పార్టీలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమనే ధోరణిలోనే కనిపించారు. సమావేశం నుంచి బయటకు రాగానే.. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్ (కేబినెట్ మంత్రులు), సయేదా షాదాబ్ ఫాతిమా (సహాయ మంత్రి)లను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ రాంనాయక్‌కు సిఫారసు చేశారు. దీన్ని గవర్నర్ వెంటనే ఆమోదించారు. దీంతోపాటు యూపీ  చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలిగా జయప్రదను కూడా తొలగించారు.

 అమర్‌సింగ్ ఛాయలొద్దు: అమర్‌సింగ్ వర్గంలోని వారెవరూ తన ప్రభుత్వంలో ఉండటానికి వీల్లేదని అఖిలేశ్ చెప్పినట్లు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, ఈ ముగ్గురిని తొలగించేందుకు కొద్ది సేపటి ముందు.. అఖిలేశ్ అనుకూల వర్గం నాయకుడైన రాంగోపాల్ యాదవ్ (ములాయం చిన్నాన్న కుమారుడు) పార్టీ కార్యకర్తలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీఎంకు సంపూర్ణ మద్దతివ్వాలి. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో ముఖం చూపించే అవకాశం ఉండదు’ అని ఇందులో పేర్కొన్నారు. అయితే పార్టీని వీడే ఆలోచన లేదని.. నేతాజీ (ములాయం)కు వెన్నుదన్నుగా ఉంటానని.. ఎమ్మెల్యేల సమావేశంలో అఖిలేశ్ అన్నట్లు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. నవంబర్ 3న వికాస్ యాత్ర మొదలైనా.. ఐదున జరిగే పార్టీ రజతోత్సవాల్లో సీఎం పాల్గొంటారన్నారు.

 ములాయంను కలసిన శివ్‌పాల్
 తనను మంత్రివర్గం నుంచి తొలగించటంతో ఎస్పీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్.. ములాయంను కలిశారు. తర్వాత బయటకు వచ్చిన శివ్‌పాల్.. ‘రాంగోపాల్‌ను పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తప్పించటంతోపాటు పార్టీ నుంచి ఆరేళ్లపాటు ములాయం బహిష్కరించారు. నన్ను మంత్రిపదవి నుంచి తప్పించినందుకు బాధపడ్డం లేదు. వచ్చే ఎన్నికల్లో ములాయం నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది’ అని ప్రకటించారు. బీజేపీతో కుమ్మక్కైన రాంగోపాల్.. తనపై, కుమారుడిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు మూడుసార్లు ఓ బీజేపీ నేతను కలిశారని ఆరోపించారు. ఈ పరిణామాలతో ఎస్పీ నిట్టనిలువుగా చీలిపోయింది. తాజా పరిణామాలపై సోమవారం ప్రజాముఖంగా స్పందిస్తానని ములాయం తెలిపారు.
 
 కాచుక్కూచున్న  విపక్షాలు
 యూపీ అన్ని పార్టీలకూ కీలకం. 2019లో కేంద్రంలో క్రియాశీలంగా ఉండాలనుకునే పార్టీలకు ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో పాగా వేయటంఅవసరం. మరీ ముఖ్యంగా బీజేపీకి. ఎస్పీ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేత రీటా బహుగుణను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. తాజా పరిణామాలతో అఖిలేశ్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎస్పీ వివాదంతో మెజారిటీ సాధించేలా బీజేపీ పావులు కదుపుతోంది. బీఎస్పీ కూడా ఈ పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎస్పీలో చీలిక ప్రధాన ప్రతిపక్షమైన తమకే అనుకూలిస్తోందని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా తాజా మార్పులపై విశ్లేషణ చేసుకుంటోంది. రాహుల్ పర్యటనలకు తోడు ప్రియాంకను వీలైనంత త్వరగా రంగంలోకి దించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement