లక్నో (ఉత్తర్‌ప్రదేశ్): ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మంత్రి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై తిరిగివెళుతూ సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్నారు. గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని కుషినగర్‌లో బుద్ద పీజీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. ఈఘటనను అక్కడే ఉన్న జర్నలిస్టు ఫోటో తీశారు.
చెప్పులు తుడిపించుకోవడంపై మంత్రిని వివరణ కోరగా.. 'నాకేం గుర్తు లేదు. నా చెప్పులు ఎవరూ తుడవలేదు' అని బదులిచ్చారు. వెంట ఉన్న ఓ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ 'మంత్రి గారు తన చెప్పులను తానే శుభ్రం చేసుకున్నారు. ఆయన ఎర్రని గుడ్డతో తుడుచుకోవడం నేను చూశాను' అంటూ మంత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ అవ్వడంతో, ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుండి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రాజేంద్ర ప్రతాప్ సింగ్ నష్టనివారణ చర్యలకు దిగారు. తాను చెప్పులను శుభ్రం చేయాల్సిందిగా సిబ్బందికి చెప్పలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment