సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అన్నాడీఎంకే నేతలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మృతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. రిటైర్డ్, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. మంత్రులు శ్రీనివాసన్, సెల్లూరు రాజుకు లై డిటెక్టర్ పరీక్షలు చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అంతేకాకుండా తమిళనాడులోని మంత్రులనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు, ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లను, రాష్ట్ర గవర్నర్‌ను సైతం ఈ వ‍్యవహారంలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ వైద్యులు, లండన్ వైద్యులను విచారణ పరిధిలోకి తీసుకువచ్చి సమగ్ర దర్యాప్తు సాగినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
మంత్రులకు సీఎం క్లాస్
జయలలిత ఆరోగ్యం గురించి మంత్రులు తలోవిధంగా చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా మంత్రులు ఆరోపణలు, అనుమానాలు గుప్పిస్తున్న దృష్ట్యా, సర్కార్ ఇరుకునపడే పరిస్థితి ఉండటంతో ఆయన... మంత్రులందరినీ తన నివాసానికి పిలిపించి మరీ క్లాస్ పీకారు. ఏ ఒక్కరూ ఇక అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడకూడదని హెచ్చరించినట్లు సమాచారం.