ఏటీఎంకు దండేసి.. దండం!
ఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నాటి నుంచి ప్రజల నోట్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో సెక్యూరిటీ గార్డు తప్పించి ఎప్పుడూ ఎవరూ కనిపించని ఏటీఎం సెంటర్ల వద్ద కూడా చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలల్లోనే ప్రజల సమయం గడిచిపోతోంది. ఇక చాలా ఏటీఎంలలో క్యాష్ కొరతతో బ్యాంకు సిబ్బంది అసలు డబ్బు నింపడం లేదు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న తూర్పు ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతం ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఎప్పుడూ నో క్యాష్ బోర్డు కనిపిస్తుండటంతో.. ఏటీఎం మెషిన్‌కు పూజలు చేసి.. కాస్త డబ్బుకావాలని వేడుకున్నారు. ఈ పూజా నిరసన కార్యక్రమంలో సుమారు 50 మంది ప్రజలు పాల్గొని ఏటీఎం మెషిన్‌కు హారతి ఇచ్చి దండేసి దండం పెట్టారు. చూడాలి మరి.. ఈ నిరసనతో అయినా బ్యాంకు అధికారులు నో క్యాష్ బోర్డు తొలగిస్తారేమో!