జైట్లీ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
♦ కోట్లా స్టేడియం నిర్మాణ వ్యయం వివరాలు చెప్పిన ఆర్థికమంత్రి జైట్లీ
♦ విపక్షంతో గళం కలిపిన కీర్తి ఆజాద్.. జైట్లీపై సిట్ దర్యాప్తుకు డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ బోర్డు వివాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం పార్లమెంటును స్తంభింపజేసింది. డీడీసీఏలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలంటూ ఉభయసభల్లో ఆందోళనకు దిగింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కె.సి.వేణుగోపాల్ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం నిర్మాణానికి రూ. 24 కోట్లు అంచనా వ్యయమైతే వాస్తవంగా రూ. 114 కోట్లు వ్యయం అయిందని.. చాలా వ్యవహారాల్లో టెండర్లు పిలిచినట్లు రికార్డులు లేవని ఆరోపించారు. ‘‘ఒక ల్యాప్ టాప్‌ను రోజుకు రూ. 36,000 చెల్లించేలా అద్దెకు తీసుకున్నారు.
ఒక ప్రింటర్‌ను రోజుకు రూ. 3,000 అద్దెకు, పూజా పళ్లేన్ని రూ. 5,000 అద్దె చెల్లించి తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో జైట్లీ పాత్ర కూడా ఉందంటూ దీనిపై జేపీసీ దర్యాప్తు చేయాలని, జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైట్లీ వెంటనే లేచి కోట్లా స్టేడియం నిర్మాణంలో రూ. 57-58 కోట్లకు సంబంధించిన సివిల్ పనులను ప్రభుత్వ రంగ సంస్థ ఈపీఐఎస్ చేపట్టిందని.. మరో 43 పనులను ఆ సంస్థ సబ్-కాంట్రక్లర్లకు ఇవ్వటం జరిగిందని చెప్పారు.
ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 114 కోట్లు వ్యయమైతే.. యూపీఏ హయాంలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం పునరుద్ధరణకు రూ. 900 కోట్లు, ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం పునరుద్ధరణకు రూ. 600 కోట్లు వ్యయమయిందని పేర్కొన్నారు. వెంటనే.. అధికార బీజేపీకే చెందిన కీర్తి ఆజాద్ నిల్చుని ‘‘డీడీసీఏ పనులకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉంటే.. సీబీఐ అక్టోబర్ 23వ తేదీన దానికి నోటీసు ఇచ్చి ఉండేది కాదు. దీనిపై కాలావధితో కూడిన దర్యాప్తును.. సీబీఐ, సిట్ దర్యాప్తును డిమాండ్ చేయాలి’’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షం తాత్కాలిక రాజకీయాల కోసం జైట్లీ పేరును లాగుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేశారు.
చర్చ పెట్టమనండి: రాజ్యసభలో జైట్లీ
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు చేతపట్టుకుని, జైట్లీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అన్ని ఆరోపణలకూ సమాధానం చెప్పటానికి తాను సిద్ధంగా ఉన్నాన్న సభానాయకుడు జైట్లీ.. దీనిపై తక్షణం చర్చ ప్రారంభించాల్సిందిగా ప్రతిపక్ష నేతకు చెప్పాలని సభాధ్యక్షుడిని కోరారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు కొనసాగించగా మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ మూడు సార్లు వాయిదా పడింది.
పార్లమెంటులో దుమారం
Published Tue, Dec 22 2015 1:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement