
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పెళ్లి
సెహోర్(మధ్యప్రదేశ్): వివాహానికయ్యే ఖర్చు భరించే స్థోమత లేక ఓ నిరుపేద జంట రాజ్యాంగ నిర్మాత విగ్రహం సాక్షిగా ఒక్కటయింది. పెళ్లి పేరుతో జరుగుతున్న ఆడంబరాలు, వృథా వ్యయాన్ని నివారించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంసెహోర్ పట్టణానికి చెందిన కల్లు జాతవ్, వైజయంతి రజోరియా అనే యువ జంటకు ఈనెల 3వ తేదీన పెళ్లి నిశ్చయమయింది. అయితే, ఇరు కుటుంబాల వారు నిరుపేదలు. వారికి పెళ్లి ఆడంబరంగా జరిపించే స్థోమత లేదు. దీంతో సామాజిక కార్యకర్తలను ఆశ్రయించారు.
వారిచ్చిన సూచనల మేరకు స్థానిక పార్కులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నిశ్చయించిన ప్రకారమే బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన ఆ జంట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహం పక్కనే బుద్ధభగవానుని చిత్రపటం ఉంచి ఏడుసార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం కల్లు జాతవ్, వైజయంతి దండలు మార్చుకున్నారు. కలకాలం అన్యోన్యంగా, ఆదర్శంగా ఉంటామని ప్రతిన చేశారు.
నిరుపేద బాలికలకు సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన’కు కూడా దరఖాస్తు చేసుకున్నామని, అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని వారు వివరించారు. అవనసర ఖర్చులను నివారించానికే తాము ఈ విధానాన్ని వధూవరులకు వివరించి, ఆచరింపజేశామని పెళ్లికి పెద్దగా వ్యవహరించిన నరేంద్ర ఖంగ్రాలే తెలిపారు.