
భూటాన్‌తో బంధం బలోపేతం
తొలి విదేశీ పర్యటనలో ప్రధాని మోడీ
భూటాన్ రాజు, ప్రధానులతో చర్చలు
భూటాన్ సుప్రీం కోర్టు భవనాన్ని ప్రారంభించిన మోడీ
థింపు: ప్రధాని హోదాలో తొలి విదేశీ పర్యటనకు భూటాన్‌ను ఎంచుకున్న నరేంద్ర మోడీ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ప్రతిన బూనారు. ఇరు దేశాల సంబంధాలను ‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు. మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భూటాన్ రాజధాని థింపు చేరుకున్నారు. ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో శాంతి భద్రతలు, పర్యాటకం తదితర అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధికి విస్తృత సహకారం, ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్యలపై ప్రధానంగా చర్చించారు. తర్వాత తోబ్గే.. మోడీకి విందు ఇచ్చారు. తమ దేశంలో ప్రభుత్వం మారినప్పటికీ భూటాన్ సంతోష, సౌభాగ్యాలకు భారత్ కట్టుబడి ఉందని, ఇరు దేశాల మధ్య సంప్రదాయ అనుబంధాలు ఉన్నాయని మోడీ విందులో అన్నారు. సంతోషానికి పొరుగున ఎలాంటి దేశముందన్నది కీలకమని, కొన్నిసార్లు సుఖసంపదలున్నా శాంతి దొరకని పరిస్థితి ఎదురయ్యే పొరుగు దేశం దొరుకుతుంటుందన్నారు. అంతకు ముందు.. అభివృద్ధికి చేయూతలో భాగంగా భారత్ రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మించిన భూటాన్ సుప్రీం కోర్టు భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు. భారత్‌లో చదువుకుంటున్న భూటాన్ విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలను రెట్టింపు చేస్తున్నట్లు(రూ.2 కోట్లకు పెంపు) ప్రకటించారు. భూటాన్ యువతకు 20 లక్షల పుస్తకాలు, పత్రికలను అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూటాన్‌తో దౌత్యసంబంధాలు నెలకొల్పుకోవడానికి, ఆ దేశాన్ని బుజ్జగించడానికి చైనా యత్నిస్తున్న నేపథ్యంలో మోడీ తొలి విదేశీ పర్యటనకు ఆ దేశాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఘన స్వాగతం: భారత విదేశాంగ విధానంలో భూటాన్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తూ పర్యటనకు విచ్చేసిన మోడీకి థింపులో ఘన స్వాగతం లభించింది. మోడీకి, ఆయన వెంట వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్‌లకు పారో విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని తోబ్గే, ఆయన కే బినెట్ మంత్రులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మోడీ సోమవారం భూటాన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసగింస్తారు.
భూటాన్ వెళ్లిన వంట మనిషి: ఇంటి భోజనాన్ని ఇష్టపడే మోడీకి భూటాన్‌లో గుజరాతీ వంటలు వండిపెట్టేం దుకు ఢిల్లీలోని గుజరాత్ భవన్ వంటమనిషి థింపు వెళ్లాడు. వారం నుంచి అతడు థింపులోనే ఉన్నాడు.