ప్రపంచ శాంతిపై బ్రిక్స్‌లో చర్చిస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి
అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు చొరవ
ఆర్థిక స్థిరత్వానికి ప్రయత్నిస్తాం
బ్రెజిల్ వెళ్తూ బెర్లిన్‌లో బస చేసిన ప్రధాని
న్యూఢిల్లీ/బెర్లిన్: బ్రెజిల్‌లో రెండు రోజుల పాటు జరిగే ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యంలో రాత్రి బస కోసం జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి భారత దౌత్యాధికారి విజయ్ గోఖలేతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆయన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు చేస్తారని భావించినా.. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు చేరడంతో ఆ మ్యాచ్ చూడడానికి మెర్కెల్ బ్రెజిల్ వెళ్లడంతో అది వాయిదా పడింది. దీంతో బెర్లిన్‌లో విశ్రాంతి తీసుకుని బయలుదేరతారు. అంతకుముందు ఢిల్లీలో బయలుదేరే సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రాంతీయ సంక్షోభాలు, భద్రతకు సంబంధించిన ప్రమాదాలపై బ్రిక్స్ సదస్సులో భారత్ చర్చిస్తుందని వెల్లడించారు.
అభివృద్ధి బ్యాంకు, వంద కోట్ల డాలర్లతో ఆగంతుక నిధి ఏర్పాటుపై బ్రిక్స్ చొరవ తీసుకునేలా భారత్ ప్రయత్నిస్తుందని మోడీ తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, మానవ సంక్షోభాలు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఈ సదస్సు జరుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోందని, చాలా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడమేగాక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోడీ పేర్కొన్నారు.
సదస్సు మంచి అవకాశం..ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి, ప్రాంతీయ సంక్షోభాలు, భద్రత ప్రమాదాలను రూపుమాపడానికి బ్రిక్స్ దేశాలు అందించగలిగే తోడ్పాటుపై చర్చించేందుకు సదస్సును ఒక మంచి అవకాశంగా భావిస్తామని ప్రధాని ఉద్ఘాటించారు. అంతేగాక బ్రిక్స్ అంతర్గత దేశాల ఆర్థిక సహకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నిలకడతో కూడిన పురోగమనం సాధించడానికి సామూహిక ప్రయత్నాలు చేస్తామన్నారు. బ్రిక్స్ ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వానికి ఆలంబనగా నిలిచే అభివృద్ధి బ్యాంకు, ఆగంతుక నిధి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రపంచ శాంతి, నిలకడ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి భారత్ అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని ప్రధాని తెలిపారు. బ్రెజిల్ సమావేశం బ్రిక్స్ రెండో దశకు దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో బ్రెజిల్‌లోని ఫోర్టెలెజాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) దేశాల ఆరో సదస్సు జరగబోయే విషయం తెలిసిందే. ప్రధాని వెంట బ్రెజిల్ చేరే బృందంలో కేంద్ర సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, ఎన్‌ఎస్‌ఏ ఏకే దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్, ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఉన్నారు.
ఆర్జెంటీనాతో రష్యా అణు ఒప్పందం..
బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన రష్యా ప్రధాని వ్లాదిమర్ పుతిన్ తొలుత అర్జెంటీనా చేరుకున్నారు. అక్కడ ఆదేశ అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్‌తో సమావేశంలో అణు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. తమ దేశంలోని అట్చా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కొన్ని యూనిట్ల నిర్మాణానికి రష్యా ఆటమిక్ కార్పొరేషన్ సహకరిస్తుందని తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. తమకు అర్జెంటీనా వ్యూహాత్మక మిత్రుడని, ఫెర్నాండెజ్‌తో తాను తరచూ సంప్రదిస్తూనే ఉంటానని చెప్పారు. లంచ్ తర్వాత పుతిన్ బ్రెజిల్ బయలుదేరి వెళతారు.