
ఒవైసీ నాలుక కోస్తే రివార్డ్
లక్నో: గొంతు మీద కత్తి పెట్టినా భారతమాతాకి జై అననన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ఈ వివాదానికి ఉత్తరప్రదేశ్ వేదికైంది. ఒవైసీ నాలుక కట్ చేసినవారికి రూ. 21 వేల రివార్డు ఇస్తానని మీరట్ కాలేజీ ఏబీవీపీ విద్యార్థి నేత ఒకరు ప్రకటించి అగ్గి రాజేశారు.
ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా ఏబీవీపీ మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థి సంఘం మాజీనేత దుష్యంత్ తోమర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరతమాతను గౌరవించడానికి నిరాకరించిన ఒవైసీ నాలుక తెగ్గోస్తే రూ. 21వేల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒవైసీ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడమే కాకుండా.. తాను దేశభక్తుడు కాదని నిరూపించుకున్నారంటూ విద్యార్థి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తన పీకమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. కొత్తతరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒవైసీపై మండిపడ్డారు. దీంతోపాటు ఒవైసీ దేశం విడిచిపోవాలనే విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.