సాక్షి, చెన్నై : హిజ్రాతో సబ్ ఇన్‌స్పెక్టర్ కుటుంబం నడిపారా? అనే విషయంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. తిరునెల్వేలి జిల్లా, బావూరుసత్రం సమీపానగల రామచంద్రపట్టినం ప్రాంతానికి చెందిన బబితారోజ్ హిజ్రా. ఈమె హిజ్రాల సంక్షేమం కోసం అనేక సాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల హిజ్రాలు లైంగిక వృత్తిని చేపట్టరాదని తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇందుకు పలువురు హిజ్రాలు వ్యతిరేకత తెలిపి బబితారోజ్ ఇంటి ముందు ధర్నా జరిపారు. ఇందుకోసం భద్రతా పనుల నిమిత్తం బావూరుసత్రం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ బబితారోజ్ ఇంటికి తరచూ వెళ్లేవాడు.
ఆ సమయంలో ఎస్‌ఐకు, హిజ్రా బబితారోజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదివరకే వివాహమై భార్య పిల్లలతో ఉన్న ఎస్‌ఐ హిజ్రా బబితారోజ్‌తో కుటుంబం నడిపినట్లు సమాచారం. ఇటీవల సదరు ఎస్‌ఐ సమీపానగల మరో పోలీసుస్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత అతను బబితారోజ్‌తో సంబంధం వదులుకున్నారు. హిజ్రా బబితారోజ్ అతన్ని సెల్‌ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా మాట్లాడేందుకు వీలుకాలేదు. దీంతో బబితారోజ్ తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐకు వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టి తనతో కుటుంబం నడిపాడని, అనేకసార్లు ఎస్‌ఐకు బంగారు నగలు, నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. దీంతో తనను మోసగించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకుని, తన నగలు, నగదు తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ ఉత్తర్వులిచ్చారు. తాళయూత్తు డీఎస్పీ బబితారోజ్, సంబంధిత ఎస్‌ఐ వద్ద ఆదివారం విచారణ జరిపారు. ఇదిలాఉండగా ఎస్‌ఐ, హిజ్రా ఒకటిగా కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment