శుభశ్రీ (ఫైల్), తండ్రి రవి
సాక్షి, చెన్నై: తన కుమార్తె మరణాన్ని శుభశ్రీ తండ్రి రవి తీవ్రంగా పరిగణించారు. నష్టపరిహారంగా రూ. కోటి ఇప్పించాలని, బ్యానర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేసే వాళ్లను కఠినంగా శిక్షించే విధంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, తన కుమార్తె మృతి కేసును ప్రత్యేక విచారణ బృందం ద్వారా దర్యాప్తు చేయించాలని పట్టుబడుతూ ఆయన మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.గత నెల పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడంతో కింద పడ్డ శుభశ్రీ మీదుగా నీళ్ల ట్యాంకర్ వెళ్లడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారాన్ని రేపింది. ఈ ఘటనతో ఫ్లెక్సీలు, బ్యానర్లపై అధికార వర్గాలు కొరడా ఝుళిపించే పనిలో పడ్డాయి. శుభశ్రీ మరణానికి కారణంగా ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేసిన వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇక, కెనడా వెళ్లాల్సిన శుభశ్రీ కాటికి వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఆ కుటుంబాన్ని అన్ని రాజకీయ పక్షాల నేతలు పరామర్శిస్తూ వస్తున్నారు. అలాగే, బ్యానర్లు, ఫ్లెక్సీలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మద్రాసు హైకోర్టు సైతం స్పందించింది. ఆ కుటుంబానికి తాత్కాలిక సాయంగా రూ. ఐదు లక్షలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ సమయంలో బుధవారం శుభశ్రీ తండ్రి రవి కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అందులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె భవిష్యత్తు, కన్న కలల గురించి గుర్తు చేశారు. తన కుమార్తె మరణం కేసును ప్రత్యేక విచారణ బృందం ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రత్యేక విచారణ బృందాన్ని కోరుతున్నట్టు పట్టుబట్టారు. అలాగే, బ్యానర్లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసే వాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శిక్షలు మరీ కఠినంగా ఉండే రీతిలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేవిధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.ఇక, తన కుమార్తె మరణం దృష్ట్యా, రూ.కోటి నష్ట పరిహారం ఇప్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, చట్టాల్ని కఠినత్వం చేయాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం దసరా సెలవుల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది. అయితే, ఈ బెంచ్ ఏదేని ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చేనా, లేదా, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఇప్పటికే దాఖలు చేసి ఉన్న పిటిషన్‌తో కలిసి సంబంధిత బెంచ్ విచారణకు ఆదేశించేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment