బ్యానర్ల దుమారం | Government Petition on Welcome Banner in Tamil nadu | Sakshi
Sakshi News home page

బ్యానర్ల దుమారం

Published Thu, Oct 3 2019 8:00 AM | Last Updated on Thu, Oct 3 2019 8:00 AM

Government Petition on Welcome Banner in Tamil nadu - Sakshi

మహాబలిపురం పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ రాక సందర్భంగా బ్యానర్లు ఏర్పాటుకు అనుమతి కోరుతూ మద్రాసు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌ దుమారం రేపింది. అధికార పక్షం సమర్థన, ప్రతిపక్షాల విమర్శలతో దుమారం రేగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ మూడురోజుల పర్యటన నిమిత్తం ఈనెల 11వ తేదీన చెన్నైకి ప్రత్యేక విమానంలో వస్తున్నారు. చెన్నై నుంచి హెలికాప్టర్‌లో మహాబలిపురం సమీపంలోని తిరువిడందైకిచేరుకుంటారు. అక్కడి నుంచి కోవలంలోని తాజ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లి బసచేస్తారు. అదే రోజు రాత్రి ఇరువురూ అనేక అంశాలపై భేటీ అవుతారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఆ తరువాత ఇరువురు నేతలూ 12, 13 తేదీల్లో మహాబలిపురాన్ని సందర్శిస్తారు. ఇద్దరు అగ్రనేతలు మూడురోజులపాటు పర్యటిస్తున్న నేపథ్యంలో అనూహ్యరీతిలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల తీరును పరిశీలించే నిమిత్తం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి  బుధవారం మహాబలిపురానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, డీజీపీ త్రిపాఠి, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ పొన్నయ్య సీఎంను అనుసరించారు.

టెక్కీ మృతితో నిషేధం: చెన్నై పల్లికరణైలో అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రాణాలను హరించిన తరువాత బహిరంగప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం అమల్లో ఉంది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే కఠినశిక్ష తప్పదని కోర్టు హెచ్చరికలు జారీచేసింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌లకు స్వాగత సత్కార ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదురోజులపాటు బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 3న విచారించనున్నట్లు ప్రకటించింది.

కాంగ్రెస్‌ ఖండన:  ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టును కోరడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కేఎస్‌ అళగిరి విమర్శించారు.మోదీ, జీ జిన్‌పింగ్‌లకు స్వాగతం పలికేందుకు టీవీలు, పత్రికల్లో ప్రకటనలు, వాల్‌పోస్టర్లు, గోడలపై రాతలు వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉండగా ఫ్లెక్సీలకు అనుమతి కోరడం చట్టాన్ని దిక్కరించడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

తప్పేంటి: మంత్రి జయకుమార్‌: బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోర్టు అనుమతి కోరడంలో తప్పేంటని మంత్రి జయకుమార్‌ ప్రశ్నిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోర్టు అనుమతితో బ్యానర్లను ఏర్పాటు చేయడం తప్పుకాదని ఆయన సమర్థించుకున్నారు. చట్టానికి లోబడే తాము అనుమతి కోరుతున్నామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement