న్యూఢిల్లీ, సాక్షి: భారత దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్న వేళ.. హస్తినలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు..
పొరుగుదేశాల అధినేతకు సైతం ఢిల్లీ వర్గాలు ఆహ్వానం పంపాయి. ఈ క్రమంలో వాళ్లకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మాల్దీవుల అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.
కిందటి నవంబర్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక.. ఒకవైపు భారత్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ, మరోవైపు చైనాతో సత్సంబంధాలు నడిపించేందుకు యత్నించారాయన. ఈ క్రమంలో భారత్‌తో ఆ దేశ సంబంధాలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ను విమర్శించడంతో పాటు బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలంటూ వ్యాఖ్యలు చేశారాయన.
ఇలాంటి పరిస్థితుల్లో.. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆ దేశ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది భారత్. అయితే ఆ ఆహ్వానానికి ముయిజ్జు అంతే సానుకూలంగా స్పందించారు. ఆహ్వానాన్ని స్వీకరించడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానంటూ బదులిచ్చారు. అంతేకాదు.. తన పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సానుకూలంగా సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. అంతకు ముందు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సోషల్ మీడియా వేదికగా ఆయన మోదీ విజయంపై అభినందనలు తెలియజేశారు.
Congratulations to Prime Minister @narendramodi, and the BJP and BJP-led NDA, on the success in the 2024 Indian General Election, for the third consecutive term.
I look forward to working together to advance our shared interests in pursuit of shared prosperity and stability for…— Dr Mohamed Muizzu (@MMuizzu) June 4, 2024
ఆదివారం సాయంత్రం జరగబోయే మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మారిషస్.. దేశాల నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment