సియోల్‌లో మాస్కులు కొనేందుకు బారులు తీరిన జనం
న్యూఢిల్లీ: చైనాలో ఉద్భవించిన కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 60 దేశాలను చుట్టుముట్టిన ఈ వైరస్ 3,100 మందిని మట్టుబెట్టింది. మరో 90 వేల మందికి సోకింది. చైనాలో 2,943 మృతి చెందగా, వైరస్ నిర్ధారణ అయిన కేసులు 80,151కు చేరాయి. ఆ తర్వాత అత్యధికంగా ఇరాన్‌లో 77 మరణాలు సంభవించగా 2,336 మందికి కోవిడ్ సోకింది. అమెరికాలోనూ ఈ వైరస్‌తో ఆరుగురు మృతి చెందగా, 90 మందికి సోకినట్లు వెల్లడైంది. భారత్‌లో మూడు కరోనా కేసులు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నోయిడాలోని రెండు ప్రైవేటు పాఠశాలలను 6వ తేదీ వరకు మూసివేశారు.
కరోనాను ఎదుర్కోవడానికి అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తమయ్యాయని ప్రధాని మోదీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో తెలిపారు. ఆగ్రాలో ఆరుగురికి వైరస్ లక్షణాలున్నట్టు అనుమానం వ్యక్తం కావడంతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఉంచారు. ఇటలీ నుంచి జైపూర్ వచ్చిన పర్యాటకుడితోపాటు అతడి భార్యకు కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో అక్కడ ఎవ్వరికీ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దనీ, పిడికిలితో మాత్రమే పలకరించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ టీం కెప్టెన్ జోయ్ రూట్ తన సహచరులకు సూచించాడు.
ప్రముఖ కంపెనీలు అప్రమత్తం..
ఏప్రిల్‌లో జరగాల్సిన ప్లాగ్‌షిప్ ఓపెన్ వరల్డ్‌ను కోవిడ్ భయంతో వాయిదా వేస్తున్నట్టు ఒరాకిల్ వెల్లడించింది. కాలిఫోర్నియాలో ఏప్రిల్‌లో జరగాల్సిన గ్లోబల్ న్యూస్ ఇనీషియేటివ్ సమిట్‌ను గూగుల్ రద్దు చేసుకుంది. మేలో జరగాల్సిన ఫేస్‌బుక్..ఎఫ్–8 డెవలపర్స్ కాన్ఫరెన్స్, మైక్రోసాఫ్ట్ మెల్‌బోర్న్‌లో తలపెట్టిన ‘ఐఓటీ ఇన్ యాక్షన్’’కాన్ఫరెన్స్ రద్దయ్యాయి. అన్ని అనవసర ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లు అమెజాన్, ట్విట్టర్ తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment