సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షులు జి.జిన్‌పింగ్‌ల మూడురోజుల తమిళనాడు పర్యటన ఖరారైనట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది.ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు సంప్రదాయపూర్వక స్వాగతం పలుకుతారు. 1.45 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి చెన్నై గిండీలోని ఐటీసీ గ్రాండ్‌చోళాకు చేరుకుని బసచేస్తారు. సాయంత్రం 4.10 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 5 గంటలకు మహాబలిపురంలోని అర్జున్ తపస్వి మండపానికి చేరుకోగానే ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత మహాబలిపురం సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ కొనసాగుతుంది. రాత్రి 8.05 గంటలకు జి జిన్‌పింగ్ తిరిగి ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. రెండోరోజు 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు తాజ్ ఫిషర్‌మెన్స్‌గోవ్ హోటల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మహాబలిపురంలో చైనా అధికారులు పరిశీలన
ఉదయం 11.30 నుంచి 12.15 గంటల వరకు టాన్‌కోహాలులో ఉన్నతస్థాయి అధికారులతో చర్చాగోష్టి సమావేశంలో పాల్గొంటారు. 13వ తేదీ కార్యక్రమాల వివరాలు అందాల్సి ఉంది. జిన్ పింగ్ బస చేసే ఐటీసీ గ్రాండ్ చోళా నుంచి మహాబలిపురం వరకు 35 చోట్ల 500 మంది కళాకారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకనున్నారు. ఈ స్వాగత కార్యక్రమాలను 15 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నైకి రానున్న ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌లకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలకనున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అలాగే జిన్‌పింగ్‌కు డీఎంకే తరఫున స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షులు స్టాలిన్ తెలిపారు. మోదీ, జీ జిన్‌పింగ్ రాకను స్వాగతిస్తున్న స్టాలిన్, వైగోలకు కేంద్రమాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.
మహాబలిపురంలో ఇరుదేశాలభద్రతా దళాలు: భారత్–చైనా భద్రతాదళాలు ఈనెల 8వ తేదీ నుంచి మహాబలిపురంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడం ప్రారంభించాయి. పోలీసు జాగిలాలతో అణువణువునా తనిఖీలు చేస్తున్నాయి. జిన్‌పింగ్‌కు తీవ్రవాదుల బెదిరింపులు ఉన్న కారణంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో 800 చోట్ల ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చైనా అధ్యక్షుని కోసం నాలుగు బుల్లెట్ ప్రూఫ్‌కార్లు చైనా నుంచి వచ్చాయి. ప్రభుత్వ బస్సులను మహాబలిపురం వెలుపలే నిలిపివేయనున్నారు. మహాబలిపురం పరిసరాల్లోని 70 మత్య్సకార గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఈసీఆర్ రహదారి పోలీసుల పహారా కాస్తున్నారు.
టిబెట్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుసహా 8 మంది అరెస్ట్: చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ రాకను నిరసిస్తూ టిబెట్ దేశానికి చెందిన విద్యార్థులను కూడగట్టిన టిబెట్ దేశానికి చెందిన టెన్సిల్‌నోర్పు అనే విద్యార్థి సంఘ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. టిబెట్‌ను ప్రత్యేక దేశంగాప్రకటించాలని చైనాకు వ్యతిరేకంగా కొందరు టిబెటిన్లు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో 11న జిన్‌పింగ్ రాకను ప్రతిఘటించేందుకు చెన్నైలో నివసిస్తున్న టిబెటిన్లు సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో సేలయ్యూరు ఆదినగర్‌లోని ఒక అద్దె ఇంట్లో విద్యార్థుల ముసుగులో నివసిస్తున్న 8 మంది టిబెటెన్లను ఈనెల 6వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. అలాగే చెన్నైలోని అనేక అతిథిగృహాలను పోలీసులు తనిఖీ చేయగా పెరియమేట్‌లోని ఒక అతిథిగృహంలో మాదకద్రవాలతో ఐదుగురు యువకులు పట్టుబడ్డారు. చెన్నై కేలంబాక్కం సమీపంలో వీసా గడువు ముగిసి తరువాత కూడా ఒక అపార్టుమెంటులో కొనసాగుతున్న ఇద్దరు నైజీరియా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాస్‌పోర్టు లేకుండా అక్కడికి సమీపంలోని ఒక కాలేజీలో చదువుతున్నట్లు వారు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment