సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం విరమించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఆయన దాదాపు 45 గంటలపాటు ధ్యానంలో నిమగ్నమయ్యారు. రెండు రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకున్నారు. ధ్యానం ముగిసిన తర్వాత మోదీ రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి సమీపంలోని తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. తిరవళ్లువర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం తీరానికి చేరుకున్న మోదీ హెలికాప్టర్‌లో తిరువనంతపురం బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
మరోసారి ఎన్డీఏకే పట్టం
‘ఎక్స్’లో ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశవాద ‘ఇండియా’ కూటమిని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. విపక్ష కూటమి తిరోగమన రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ప్రజలు చూశారని, తమకు మళ్లీ అధికారం అప్పగించబోతున్నారని వెల్లడించారు.
పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల క్రియాశీల భాగస్వామ్యమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు తోడ్పడిన భద్రతా దళాలకు సైతం ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment